● భారీ బందోబస్తు మధ్య పేదల ఇళ్ల తొలగింపు ● రోడ్డున పడ్డ 60 కుటుంబాలు
ఉండి: పిల్లాపాపలతో రోడ్డున పడతాం.. ఇక మాకు దిక్కేవరంటూ సుమారు 60 కుటుంబాలు ఘొల్లుమన్నాయి. ఎవరేమనుకున్నా.. ఎవరెన్ని కన్నీళ్లు పెట్టుకున్నా ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు పేదల ఇళ్లను కూలగొట్టేశారు. అంతా మా ఇష్టం అన్నట్టుగా ఇళ్లను నేలమట్టం చేశారు. దీంతో ఉండి మండలం ఉణుదుర్రులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలోని ఆలకోడు డ్రెయినేజ్ భూ ముల్లో నివాసముంటున్న సుమారు 60 కుటుంబాలకు చెందిన ఇళ్లను బుధవారం అధికారులు భారీ బందోబస్తు సాయంతో పొక్లయిన్లతో కూలగొట్టారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు మహిళలు, యువకులు ప్రయత్నించగా వారిని నిలువరించారు. దీంతో బాధిత మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. కన్నీళ్లతో బోరుమని విలపించారు. కొద్దిరోజులుగా ఉణుదుర్రు బాధితులకు అండగా నిలిచిన సీపీఎం నాయకులు జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్, జిల్లా నాయకుడు ధనికొండ శ్రీనివాస్‌ను పోలీసులు ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. వేకువజాము నుంచి ఇళ్ల తొలగింపును ప్రారంభించారు. కనీసం ఇళ్లల్లోని సామాన్లు తీసుకునేందుకు కూడా ఇబ్బంది పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు మూడు సెంట్లు భూమి ఇస్తామన్నారు.. ఇప్పుడు ఉన్నపళంగా ఇళ్లల్లో నుంచి గెంటేస్తున్నారని యువకులు కన్నీటిపర్యంతమయ్యా రు. ఓట్లు వేసి గెలిపించినందుకు తమ జీవితాలు నాశనం చేశారని బోరుమన్నారు.
డిప్యూటీ స్పీకర్ బంధువుల కోసమే..
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బంధువులైన భూస్వాముల ఆక్వా చెరువులకు అడ్డులేకుండా చేసేందుకే పేదల ఇళ్లను తొలగించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. ఇళ్ల తొలగింపును సీపీఎం తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు. ఆక్వాచెరువులకు వారు సులభంగా వెళ్లేలా, వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకే పేదల ఇళ్లను తొలగించారని విమర్శించారు. అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. హౌస్ అ రెస్టులు చేసిన సీపీఎం నాయకులను వెంటనే వదిలిపెట్టాలని, బాధితులకు తక్షణమే నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.


