మెరిసిన బాలికలు
సాక్షి, భీమవరం: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో 85.59 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా వీరిలో బాలురు 82.41 శాతం, బాలికలు 88.75 శాతం ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి అత్యధిక మార్కులు సాధించిన మొదటి పది మంది విద్యా ర్థులు బాలికలే కావడం గమనార్హం. పది ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 17వ స్థానంలో నిలిచింది.
2025–26 విద్యాసంవత్సరానికి గాను మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలోని 132 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. గురువారం విద్యాశాఖ ఫలితాలను విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి బాలురు 11,144 మంది బాలికలు 11,219 మంది మొత్తం 22,363 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 19,141 మంది ఉత్తీర్ణత సాధించగా బాలురు 9,184 (82.41 శాతం), బాలికలు 9,957 (88.75 శాతం) మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 12,387 మంది విద్యార్థులకు గాను 9,567 (77.23 శాతం) మంది, ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి 9,976 మంది విద్యార్థులకు 9,574 (95.97శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అత్తిలి మండలం బల్లిపాడు జెడ్పీ హైస్కూల్, భీమవరంలోని నాగేంద్రపురంలో గల జెడ్పీ హైస్కూల్, మొగల్తూరు మండలం పాతపాడులోని జెడ్పీ హైస్కూల్, తాడేపల్లిగూడెంలోని కృష్ణయ్యపాలెం జెడ్పీ హైస్కూల్, కడకట్లలోని ఎంజేపీఏపీ బీసీడబ్ల్యూ రెసిడెన్సియల్ స్కూల్, గణపవరంలోని కాశీపాడు హైస్కూల్ నూరుశాతం ఉత్తీర్ణత సాధించాయి. కోరుకొల్లులోని హైస్కూల్‌లో తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. అత్యధిక ఉత్తీర్ణత శాతంలో గత ఏడాది రాష్ట్రంలో 16 స్థానం సాధించగా ఈ ఏడాది 17వ స్థానంలో నిలిచింది.
రీకౌంటింగ్‌కు దరఖాస్తులు
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేయించుకోవాలనే వారు మే 1 నుంచి 7వ తేదీ వరకు సంబంధిత పాఠశాల హెచ్‌ఎంలకు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ తెలిపారు. రీ కౌంటింగ్ నిమిత్తం ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలన్నారు. పోస్టు, కొరియర్ ద్వారా వచ్చిన దరఖాస్తులు, డీడీలు, చెక్కుల రూపంలో చేసిన చెల్లింపులు స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
శీలబోయిన దివ్య శ్రీసాయి, ఇరగవరం (589)
పాలకొలను ధనశ్వి, పాలకొల్లు (589)
ప్రభుత్వ పాఠశాలల నుంచి 1,719 మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించగా అత్యధిక మార్కులు సాధించిన మొదటి పది మంది విద్యార్థుల్లో బాలికలే ఉన్నారు. మొత్తం 600 మార్కులకు గాను అంబటి జయశ్రీ 592 (మట్లపాలెంలోని ఎస్‌పీఎస్‌ఆర్ జెడ్పీ హైస్కూల్) మార్కులతో జిల్లాలో మొదటిస్థానంలో నిలవగా, బైలపాటి పావని 590 (భీమవరం ఏఆర్‌కేఆర్ మున్సిపల్ హైస్కూల్), ఇమ్మలరాజు రక్షిత శ్రీనాగ వైష్ణవి 589 (కొమ్ముచిక్కాల జెడ్పీ హైస్కూల్), బండారు ధరణిగంగా 589, (భీమవరం పీఎస్‌ఎం గర్‌ల్స్ హైస్కూల్), శీలబోయిన దివ్యశ్రీసాయి 589 (ఇరగవరం జెడ్పీ హైస్కూల్), పాలకొలను ధనశ్వి 589 (పాలకొల్లు బీవీఆర్‌ఎం జీహెచ్‌ఎస్), కొలుకులూరి విద్య హాసిని 588 (తణుకు జెడ్పీ హైస్కూల్), సలాది రూపశ్రీ 588 (కరుగోరుమిల్లి జెడ్పీ హైస్కూల్), కర్రి తన్మయి 588 (ఆరవల్లి జెడ్పీ హైస్కూల్), మహ్మద్ నఫీసా 587 (నరసాపురం టైలర్‌పేట మునిసిపల్ హైస్కూల్) మార్కులు సాధించారు.
‘పది’లో జిల్లాలో 85.59 శాతం ఉత్తీర్ణత
82.41 శాతం బాలురు, 88.75 శాతం బాలికలు
రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచిన జిల్లా
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తుకు 7 వరకు గడువు


