భీమవరం: ప్రభుత్వ అనుమతులు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) భీమవరం శాఖ గురువారం జాయింట్ కలెక్టర్ టి రాహుల్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రాయి వెంకట్ దుర్గాసాయి మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి భీమవరం పట్టణం, గణపవరం, ఆకివీడు తదితర ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటుచేస్తున్న విద్యాసంస్థల భవన నిర్మాణాలు పూర్తిగాకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నాయన్నారు. దీని వలన విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ భీమవరం పట్టణ కార్యదర్శి శ్యామ్ విజయరాజ్, సతీష్, బోడపాటి తేజ తదితరులు పాల్గొన్నారు.
పాలకొల్లు సెంట్రల్: పదో తరగతి పరీక్షా పలితాల్లో తల్లీకొడుకులు ఉత్తీర్ణత సాధించారు. పాలకొల్లుకు చెందిన బండారు లక్ష్మీ లహరి ఆరో తరగతిలో చదువు ఆపేశారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో ఏపీఓఎస్‌ఎస్ ద్వారా ఆమె తన కుమారుడితో కలిసి పదో తరగతి పరీక్షలు రాశారు. గురువారం విడుదలైన ఫలితాల్లో కుమారుడు విజయ్ 562 మార్కులు సాధించగా లక్ష్మీ లహరి 360 మార్కులు సాధించారు. లక్ష్మీ లావణ్య మాట్లాడుతూ తన కుమారుడు పాఠశాలకు వెళ్లి వచ్చిన అనంతరం తనకు ఇంట్లో పాఠాలు వివరించి చెప్పేవాడని చెప్పారు. కుమారుడితో కలిసి తాను కూడా ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉందన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ఇటీవల ముంబైలో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ అనుభవాలను గురువారం తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో అధికారులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి అవకాశం పొందిన వారిలో డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్‌ఎస్ వేణుగోపాల్, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, డీఈవో ఇ.నారాయణ, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డీఎం ఎండీ ఇబ్రహీం, నీటిపారుదల శాఖ ఈఈ రమేష్ ఉన్నారు. వీరికి కలెక్టర్ సీహెచ్ నాగరాణి ప్రత్యేక అభినందనలు తెలిపారు.


