ద్వారకాతిరుమల: సుస్వరాల మంగళ వాయిద్యాలు వీనుల విందుగా మార్మోగుతుండగా.. వినువీధుల నుంచి పండు వెన్నెల నిండుగా జాలువారుతుండగా.. ఒళ్లంతా కళ్లు చేసుకుని భక్తజనమంతా తిలకిస్తుండగా.. అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛరణలు పఠిస్తుండగా.. ఆ శ్రీవారు, సిగ్గులొలుకుతున్న అమ్మవార్లను పరిణయమాడారు. ఈ అపురూపమైన అద్భుత దృశ్యం ద్వారకాతిరుమల క్షేత్రంలో ఆవిష్కృతమైంది. చినవెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా సాగింది.
వేడుక జరిగిందిలా..
ముందుగా ఆలయ తూర్పు రాజగోపురం వద్ద పచ్చిపూలతో కల్యాణ వేదికను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అనంతరం శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఆలయం నుంచి రెండు వేరువేరు వాహనాలపై అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అట్టహాసంగా కల్యాణ వేదిక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన రజిత సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి, అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించారు. వివిధ ఘట్టాలను పూర్తిచేసి శుభముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను భక్తుల గోవింద నామస్మరణల నడుమ నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు, దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు పట్టు వస్త్రాలను సమర్పించారు. పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమాన్ని అనుసరించి జరిపిన ఈ వేడుక భక్తజనులను పరవశింపజేసింది. ఈ వేడుకలో ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు పాల్గొన్నారు. కల్యాణ మహోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లు వెండి గరుడ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు.. : రాత్రి 8 గంటల నుంచి – శ్రీవారి రథోత్సవం
శ్రీవారి ప్రత్యేక అలంకారం : శ్రీ కూర్మ అలంకారం
వైభవంగా శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం
వెండి గరుడ వాహనంపై ఊరేగిన స్వామివారు
నేడు రాత్రి 8 గంటల నుంచి రథోత్సవం


