శేష్‌మహల్‌ రోడ్డులో ఏం జరుగుతోంది? | - | Sakshi
Sakshi News home page

శేష్‌మహల్‌ రోడ్డులో ఏం జరుగుతోంది?

Apr 29 2026 8:36 AM | Updated on Apr 29 2026 8:36 AM

తాడేపల్లిగూడెం: స్కామ్‌లు, స్కీమ్‌లు.. హవాలా.. దివాలా...ఆత్మహత్యలు, టోకరాలకు పట్టణంలో శేష్‌మహల్‌ రోడ్డు కేరాఫ్‌గా మారిందా..? అనే సందేహాలు ప్రజల్లో వస్తున్నాయి. ఒక్కప్పుడు సినిమా థియేటర్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే ఈ ప్రాంతం ఎనిమిది నెలలుగా తరచూ వార్తల్లోకి వస్తుంది. ఓ పక్క జీఎస్టీ అధికారుల దాడులు, మరో వైపు చోరీ సొత్తు రికవరీ పేరిట కోనసీమ జిల్లా కొత్తపేట పోలీసులు సోదాలతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవలకాలంలో కొత్తపేట పోలీసు స్టేషన్‌లో కొన్ని చోరీలు జరిగాయి. నిందితులు నలుగురిని విచారించగా, చోరీ సొత్తులో 21 గ్రాముల బంగారాన్ని శేష్‌మహల్‌ రోడ్డులోని ఒక బంగారు దుకాణంలో విక్రయించినట్టుగా చెప్పారు. కొత్తపేట సబ్‌ఇన్‌స్పెక్టర్‌ నిందితులు నలుగురిని సంకెళ్లతో ఓ వాహనంలో తీసుకొచ్చారు. దుకాణం చూపించాక హైడ్రామా సాగింది. చివరికి ఆరోపణ ఎదుర్కొన్న వ్యక్తి చోరీ సొత్తు కొనలేదని చెప్పడంతో, తదుపరి విచారణ కోసం పోలీసులు సదరు వ్యాపారిని కొత్తపేట తీసుకెళ్లారు. చోరీ బంగారు బరువు కాస్తా నిందితులు మాట మార్చడంతో ఎనిమిది గ్రాములకు తగ్గింది. తాడేపల్లిగూడెంలో విక్రయించింది ఎనిమిది గ్రాములే అని చెప్పారు. ఆ బంగారం కోసం తాను కొనలేదని దుకాణ యజమాని చెప్పడంతో పూచీకత్తు మీద పెద్ద మనుషుల సమక్షంలో అతడిని వదిలేశారు.

జీఎస్టీ అధికారుల దాడులు

ఈ ప్రాంతంలో బంగారు దుకాణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే నెల రోజుల ముందు ఒక దుకాణంలో మూడు రోజుల పాటు జీఎస్‌టీ దాడులు జరిగాయి. ఆ సమయంలో కూడా ఈ ప్రాంతం గురించి చర్చ సాగింది. ఎఫ్‌ఎంబీ ప్రకారం వంద అడుగుల రోడ్డు ఉండాల్సిన ఈ ప్రాంతంలో నాయకులను ప్రసన్నం చేసుకుని రోడ్డును దర్జాగా ఆక్రమించి, షాపులు కట్టేశారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఒక వ్యాపారి వ్యాపారంలో దెబ్బతిని రాజమండ్రి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కూటమి నాయకుడొకరు విషయం సెటిల్‌మెంటు పేరిట కేజీలకు కేజీలు వెండి నొక్కేశాడని సమాచారం. ఇదే ప్రాంతానికి ఒకరు ఇటీవల బంగారం సరఫరా చేస్తే, వ్యాపారులను మోసం చేయబోయి దొరికిపోయారు. వీటన్నింటికి శేష్‌మహల్‌ రోడ్డు కేరాఫ్‌గా మారడం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి వినియోగదారులు బంగారం కొనుగోలు చేసే విషయంలో దుకాణదారుల ట్రాక్‌ను పరిగణనలోకి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తాజాగా చోరీ సొత్తు కోసం పోలీసుల తనిఖీలు

Advertisement
 
Advertisement
Advertisement