పెనుమంట్ర: రైతులకు, మిల్లర్లకు ఆమోదయోగ్యంగా ఉండే రైస్ స్టీమింగ్ చేసే ప్రక్రియను రైతుల అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులకు సూచించారు. మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం గోదావరి మండల పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గోదావరి మండల వరి రైతులు ఉత్పత్తి చేస్తున్న ధాన్యాలు మిల్లింగ్ చేస్తున్న సమయంలో నూక శాతం పెరిగి ఆ బియ్యనికి మార్కెట్ విలువ తగ్గిపోవడం గోదావరి మండల రైతులకు ప్రధాన సమస్యగా ఉందన్నారు. రైస్‌ను స్టీమింగ్ చేసి మిల్లింగ్ చేయడం వల్ల ధాన్యం పై పోరలో ఉండే పోషకాలు బియ్యంలో చేరి పోషక విలువలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పీవీకే జగన్నాథరావు వరి, చెరకు పంటలు విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. అనంతరం గోదావరి మండల సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు అభ్యుదయ రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల గురించి 2026–27 సంవత్సరానికి సంబంధించి పరిశోధన, విస్తరణ ప్రణాళికలను రూపొందించారు.


