● వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బంకుల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు
● తమ గోడు వెల్లబోసుకున్న రైతులు, డ్రైవర్లు, రవాణా రంగ కార్మికులు
తణుకు అర్బన్: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత వల్ల సామాన్య ప్రజలు, రైతులు, రవాణా రంగం సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు తణుకులోని పెట్రోలు బంకుల వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం ఆయన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడులో లేని ఇంధన కొరత ఏపీలోనే ఎందుకు ఏర్పడిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యంగా వరి కోతల సమయంలో యంత్రాలకు సరిపడా డీజిల్ అందక రైతాంగం, ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లు నానా యాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనంపై ర్యాలీగా బంకుల వద్దకు చేరుకున్న కారుమూరి, అనంతరం నరేంద్ర సెంటర్‌లో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పార్టీ పంచాయితీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, మారిశెట్టి శివశంకర్, బల్లిపాడు మాజీ సర్పంచ్ బాలాజీ, మెహర్ అన్సారీ, పెనుమాల రాజేష్, సత్తి పవన్ మహేష్‌రెడ్డి (చిన్నూ), గెల్లా జగన్, మమతా యాదవ్, గెద్దా శ్రీకాంత్, షేక్ జిలానీ, బిరుదుకోట చింతన్న, రామిశెట్టి రాము, పైడి సాయిసూర్య పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెంలో..
తాడేపల్లిగూడెం: పెట్రోలు, డీజిల్ సమస్యలతో రైతులు అల్లాడిపోతుంటే, వ్యవసాయ శాఖ మంత్రి విదేశీ పర్యటనల పేరిట షికార్లు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ గూడెం కన్వీనర్ వడ్డి రఘురాం విమర్శించారు. పెట్రోలు, డీజిల్ సమస్యపై మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెట్రోలు బంకు వద్ద నిరసన చేపట్టారు. బంకుల వద్ద ప్రజలు పాట్లు పడుతుంటే ప్రభుత్వం నిద్రపోతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చోద్యం చూస్తున్నారన్నారు.


