అక్రమార్కులు.. అప్రోచ్ రోడ్డునూ వదలరు
● అర్ధరాత్రి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
● పట్టించుకోని అధికారులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: చంద్రబాబు సర్కారులో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రేయింబవళ్లు చూడకుండా అక్రమార్కులు మట్టి తవ్వి తరలించేసి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా సూరప్పగూడెంలోని జాతీయ రహదారి ఐస్ ప్లాంట్ పక్కనే ఉన్న అప్రోచ్ రోడ్డు గట్టుపై అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది రాత్రికి రాత్రి గట్టుపై ఉన్న మట్టిని తవ్వి తరలించి ప్రైవేటు స్థలాన్ని పూడ్చేందుకు వినియోగించేశారు. దీనిపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సూరప్పగూడెంలోని జాతీయ రహదారి ఐస్ ప్లాంట్ పక్కనే ఉన్న అప్రోచ్ రోడ్డు గట్టును కొందరు వ్యక్తులు మంగళవారం రాత్రి అక్రమంగా తవ్వేశారు. భారీ జేసీబీ సాయంతో అక్రమంగా 30 లారీల మట్టిని తరలించుకుపోయారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ మట్టితో రియల్ ఏస్టేట్ భూమిని పూడ్చేశారు. గట్టు తవ్వేయడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీనిపై ఐస్‌ప్లాంట్ మేనేజర్ తిరుమలశెట్టి రాజు బుధవారం భీమడోలు రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సర్వీస్ రోడ్డును అక్రమంగా తొలగించి ప్రైవేటు స్థలంలో మెరక చేయడంపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న భీమడోలు ఆర్‌ఐ జగన్నాథం, వీఆర్వో ప్రవీణ్ ఘటనా స్థలానికి చేరుకుని మట్టి తవ్వేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. తగు చర్యలు కోసం తహసీల్దార్‌కు నివేదిక సమర్పించినట్లు చెప్పారు.
అక్రమార్కులు.. అప్రోచ్ రోడ్డునూ వదలరు


