జగనన్న కాలనీలపై కక్ష
రోడ్లు నిర్మించాలి
మౌలిక వసతులు కల్పించాలి
జగనన్న కాలనీ ఇళ్లకు బిల్లులు నిల్
భీమవరం: పేదలకు అందమైన ఇళ్లు నిర్మిస్తాం. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటిస్థలాలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క సెంటు భూమి పేదలకు ఇవ్వకపోగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటుచేసిన జగనన్న కాలనీలపై కక్ష కట్టింది. వాటికి వసతులు కల్పించకుండా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోంది. దీనితో కాలనీల్లో నివాసముంటున్న లబ్ధిదారులు కనీసం సౌకర్యాలు కరువై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 637 జగనన్న లేఅవుట్స్ ప్రత్యేకంగా ఏర్పాటుచేసి 70 వేల ఇళ్లు మంజూరు చేశారు. పేదల ఇంటి నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా దాదాపు 50 ఏజెన్సీల ద్వారా ఇళ్లు నిర్మించే బాధ్యతను అప్పగించారు. 2022లో ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి జగనన్న కాలనీలతోపాటు సొంతస్థలాల్లో దాదాపు 35 వేల వరకు ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
కాలనీల్లో వసతులు కరువు : జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మాణం సాగుతున్న సమయంలోనే కాలనీలకు విద్యుత్ సౌకర్యం, మంచినీటి సరఫరా వంటి వాటికి నిధులు కేటాయించి పెద్దపెద్ద కాలనీల వద్ద ప్రత్యేకంగా విద్యుత్ సబ్‌స్టేషన్స్ ఏర్పాటుచేసి విద్యుత్ లైన్లు వేశారు. మంచినీటి సరఫరాకు అనేక చోట్ల పైపులైన్స్ పూర్తి చేయగా రోడ్లు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మారడంతో చంద్రబాబు ప్రభుత్వం జగనన్న కాలనీలను పూర్తిగా విస్మరించింది. రోడ్ల నిర్మాణం లేకపోవడంతో వర్షం వస్తే మోకాలు లోతు బురదలో లబ్ధిదారులు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. రోడ్లు లేకపోవడంతో పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. దట్టంగా పచ్చగడి అలుముకోవడంతో ఆయా ప్రాంతాలు చిట్టడవిని తలపిస్తున్నాయి. దీంతో దోమలు పెరిగి ఇళ్లలో నిద్రపోలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. కొన్నిపాంత్రాల్లో చేపట్టిన రోడ్ల లెవలింగ్‌కు ప్రభుత్వం దాదాపు రూ.20 కోట్లు నిధులు విడుదల చేయాల్సివుందని చెబుతున్నారు. నిర్మాణం పూర్తిచేసుకున్న ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో అప్పడప్పుడు ట్యాంకర్ ద్వారా వచ్చిన నీటిని టిన్స్‌లో నింపుకుని కాలం గడపాల్సివస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జగనన్న కాలనీలో ఇళ్ల మధ్య పిచ్చి మొక్కలతో చిట్టడవి తలపిస్తున్న దృశ్యం
ఇళ్లకు మంచినీటి కుళాయిలు లేక టిన్స్‌లో నీరు నింపుకుంటున్న దృశ్యం
జగనన్న కాలనీల్లో వర్షం వస్తే రోడ్లు మునిగి ఇబ్బంది పడుతున్నాం. బురదమయంగా మారి పెద్ద పెద్ద గోతులు పడుతున్నాయి. నడిచి వెళ్లెందుకు కష్టంగా ఉంది. ఇల్లు నిర్మించుకున్న నాటి నుంచి రోడ్లు సరిగా వేయలేదు. వెంటనే కాలనీల్లో రోడ్లు నిర్మించాలి.
– డి.మోజేష్, మోగల్లు
నియోజకవర్గంలోనే మోడల్ కాలనీగా తీర్చిదిద్దామన్నారు. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. సౌకర్యాలు కల్పిస్తే బాగుటుంది. రహదారులు, డ్రెయినేజీ సౌకర్యాలు కల్పించాలి.
– సీహెచ్ మహాలక్ష్మి, మోగల్లు
సదుపాయాలు కల్పించకుండా ఇక్కట్లకు గురిచేస్తున్న బాబు ప్రభుత్వం
జిల్లాలో వైఎస్సార్‌సీపీ పాలనలో 70 వేల ఇళ్ల మంజూరు
35 వేల ఇళ్లు పూర్తయినట్లు అంచనా
గతంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి చంద్రబాబు సర్కారులో బిల్లులు నిల్
కాలనీల వద్ద రోడ్లు లేక చిట్టడవిని తలపిస్తున్న దుస్థితి
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగనన్న కాలనీలను ప్రధానమంత్రి ఆవాస యోజన పథకంగా మార్పుచేసి ఇళ్లు నిర్మిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో నిర్మించుకున్న ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకుండా కొత్తగా నిర్మించుకున్నవారికి మాత్రమే బిల్లులు చెల్లించి గతంలోని లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జగనన్న కాలనీలపై కక్ష
జగనన్న కాలనీలపై కక్ష
జగనన్న కాలనీలపై కక్ష
జగనన్న కాలనీలపై కక్ష
జగనన్న కాలనీలపై కక్ష
జగనన్న కాలనీలపై కక్ష


