ఆక్వా కళాశాల ఆధ్వర్యంలో శిక్షణ
నరసాపురం రూరల్: స్థానిక మత్స్య కళాశాల ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు రొయ్యల సాగు – వ్యాధుల యాజమాన్యంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం జాతీయ మత్య్సాభివృద్ధి మండలి (ఎన్‌ఎఫ్‌బీడీ) ఆర్థిక సహకారంతో ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ కె.మాధవన్, రిసోర్స్ పర్సన్లు డాక్టర్ టి నీరజ, యూనివర్శిటీ హెడ్ ఆర్.అరుణ్ కుమార్, డాక్టర్ కె.మాధవి, డా. ఎన్.వీరభద్రరావు, తదితరులు రొయ్యల రైతులకు శిక్షణా కార్యక్రమం ప్రాముఖ్యతను తెలిపారు. రొయ్యల చెరువులో వ్యాధులు ఎలా గుర్తించాలి, నివారించాలి.. మంచి లాభాలను పొందడానికి పాటించాల్సిన సూచనలు వివరించారు. రొయ్యల చెరువులో వాడే లైనర్‌ల ప్రాముఖ్యత, రొయ్యలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలిపారు.
కామవరపుకోట: మండలంలో కొత్తూరులో కోటి సంతకాల సేకరణలో భాగంగా చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు పాల్గొని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించారు. మండల కన్వీనర్ రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని గ్రామంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కంభం విజయరాజు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం చంద్రబాబు ప్రభుత్వ పాతరకు కారణం కాబోతుందన్నారు.
ద్వారకాతిరుమల: తమ వద్ద మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసి, ఇవ్వాల్సిన సొమ్మును ఎగ్గొట్టిన మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ చిలక అప్పారావుపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. రైతు సంఘం ఆధ్వర్యంలో హనుమాన్లగూడెంలో ఆర్గనైజర్ ఇంటి ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్టా భాస్కరరావు, గుర్రం రాంబాబు మాట్లాడుతూ మోసపోయిన రైతులకు అధికారులు న్యాయం చేయాలని కోరారు. గతంలో దీనిపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయగా మండల తహసీల్దార్, వ్యవసాయాధికారి ఆర్గనైజర్‌ను పిలిపించి మాట్లాడారని, ఆ సమయంలో అతడు రైతులకు సీడ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని అన్నారు. రైతుల సమక్షంలో జరిగిన ఒప్పందంలో ఇచ్చిన బ్యాంకు చెక్కులు బౌన్స్ అయ్యాయని తెలిపారు. రైతులకు దాదాపు రూ.15 లక్షలకు పైగా సొమ్ము రావాల్సి ఉందన్నారు.
వీరవాసరం: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం ద్వారా చేకూరుతున్న లబ్ధి రైతు కష్టానికి చేదోడు వాదోడుగా నిలుస్తుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం వీరవాసరం మండలం రాయకుదురు కోపరేటివ్ బ్యాంకు ఆవరణలో ఏర్పాటుచేసిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఈరోజు రైతులందరికీ శుభదినం అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,03,761 మందికి రైతులకు రూ.68.97 కోట్ల ఖాతాలలో జమచేశామన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆక్వా కళాశాల ఆధ్వర్యంలో శిక్షణ
ఆక్వా కళాశాల ఆధ్వర్యంలో శిక్షణ


