‘మావో’ల షెల్టర్ జోన్‌గా ఏలూరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరును మావోయిస్టులు సేఫ్ షెల్టర్ జోన్‌గా ఎంచుకున్నారు. ఇతర రాష్ట్రాల వలస కూలీలుగా సాధారణ ప్రజల్లో కలిసిపోయి కొద్దికాలం తలదాచుకోవాలనుకున్నారు. దానికనుగుణంగానే కూలి పనుల కోసం వచ్చామని చెప్పి ఇల్లును అద్దెకు తీసుకున్నారు. కొద్దిరోజులకే పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కడం కలకలం రేపింది. ఏలూరులోని గ్రీన్‌సిటీలో మావోయిస్టుల అరెస్టుతో జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. 15 మంది మావోయిస్టులను మంగళవారం అరెస్టు చేసి బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి వద్ద హాజరు పరచగా రిమాండ్ విధించి సెంట్రల్ జైలుకు పంపారు. భారీ బందోబస్తు నడుమ పోలీసులు వారిని జైలుకు తరలించారు. అరెస్టు అయిన మావోయిస్టుల్లో ఒక మైనర్ ఉన్నారు. మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు లచ్చు అలియాస్ గోపాల్ నేతృత్వంలో 14 మంది ఏలూరులో గత 15 రోజులుగా షెల్టర్ పొందుతున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ పక్కా సమాచారంతో దాదాపు 10 రోజులు పాటు నిఘా కొనసాగించి పూర్తిగా నిర్ధారించుకున్న తరువాత మంగళవారం మెరుపుదాడి నిర్వహించి అరెస్టు చేశారు. 15 మంది నుంచి రూ.2.80 లక్షల నగదు, 15 తుపాకులు, 132 రౌండ్ల బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. వైద్య అవసరాలు, ఏలూరులో పోలీసుల హడావుడి కొంత తక్కువగా, ప్రశాంతంగా ఉంటుందనే యోచనతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పోలీసులు నివాసం ఉండే చోటే ఎంపిక చేసుకున్నారు. నగరంలో పశ్చిమబెంగాల్ మొదలుకొని ఒడిశా వరకు ఐదారు రాష్ట్రాలకు చెందిన కార్మికులు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సభ్యులు కావడంతో ఏలూరును సురక్షిత ప్రాంతంగా భావించారు.
11 ఏళ్ల తరువాత..
జిల్లాలో మావోయిస్టుల హడావుడి, అరెస్టులు జరిగి 11 ఏళ్లు గడిచింది. గతంలో బుట్టాయగూడెం కేంద్రంగా, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల కేంద్రంగా మావోయిస్టుల కార్యకలాపాలు అధికంగా ఉండేవి. గతంలో జలతారువాగు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2001లో న్యూడెమోక్రసీకి చెందిన ధర్మన్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ మృతి చెందారు. 2002లో పాతపట్టిసీమ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారు. 2003లో పందిరిమామిడిగూడెం వద్ద ఆర్టీసీ బస్సును దగ్ధం చేశారు. 2004లో జనశక్తి క్రాంతి దళం ఎల్‌ఎన్‌డీ పేటలో వ్యాపారి కొల్లూరి గోపాలకృష్ణను మావోయిస్టులు కాల్చిచంపారు. ఇదే ప్రాంతంలోని డేరా కొండ వద్ద 2005లో పోలీస్ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. 2006లో పోలవరం సమీపంలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. చివరిగా 2014లో బుట్టాయగూడెం సమీపంలో న్యూడెమోక్రసీ నక్సల్స్ 14 మంది, యాక్షన్ టీమ్ సభ్యులు ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసుల రికార్డుల ప్రకారం మావోయిస్టులకు సంబంధించి చివరి అరెస్టు ఘటనగా రికార్డయ్యింది.
2014లో చివరిగా మావోయిస్టుల అరెస్టు
తాజాగా ఏలూరులో 15 మంది..
10 రోజుల నుంచి మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ నిఘా
పక్కా సమాచారంతోనే ఇల్లు ముట్టడించి అదుపులోకి
‘మావో’ల షెల్టర్ జోన్‌గా ఏలూరు


