తగ్గిన ఖరీఫ్ దిగుబడి
దిగుబడులు తగ్గాయి
● ఎకరాకూ 30 బస్తాల కంటే తక్కువే
● తెగుళ్లు, తుపాను ప్రభావంతో నష్టం
ఆకివీడు: ఒకవైపు తెగుళ్ల తంటా, మరోవైపు వాతావరణం అనుకూలించక ఖరీఫ్‌లో ధాన్యం దిగుబడులు భారీగా తగ్గిపోయాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎలుకల దాడి వరి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. పొట్ట, ఈనిక, పూత దశలో తెగుళ్లు విజృంభించాయని, అదే సమయంలో మోంథా తుపాను నియోజకవర్గంలో ఖరీఫ్ పంటపై తీవ్ర ప్రభావం చూపిందని అంటున్నారు. వరి చేలల్లో కంకులు పుష్కలంగా ఉన్నప్పటికీ తప్ప, తాలు, పసిరి గింజల శాతం అధికంగా వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో పాటు పలు చోట్ల కుదుళ్లు అధికంగా వేసుకోకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. దీంతో మాసూళ్లు పూర్తి చేసిన రైతులు దిగాలుగా ఉన్నారు. ఎకరానికి 25 నుంచి 30 బస్తాల దిగుబడి వచ్చిందని చెబుతున్నారు. మెరక ప్రాంతాల్లో 35 బస్తాల వరకూ దిగుబడి వచ్చిందంటున్నారు. గతంలో 35 బస్తాల నుంచి 40 బస్తాల వరకూ దిగుబడి ఉండేది. ఈ ఏడాది ఖరీఫ్ సాగుపై వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. బదిలీల పరంపరలో ఏ అధికారి వచ్చారో, ఏ అధికారి వెళ్లారో తెలియకపోవడం, వ్యవసాయ శాఖలో క్షేత్రస్థాయిలో ఆర్‌ఎస్కేల బదిలీలు, మండల వ్యవసాయ శాఖ అఽధికారుల బదిలీలతో కొత్తవారు చేరినప్పటికీ క్షేత్రస్థాయి పర్యటన తీవ్రంగా లోపించిందని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ సాగులో పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు కన్పించడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పంట పడిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందంటున్నారు. దిగుబడులు తగ్గినా, పంట నష్టపోయినా నష్ట పరిహారం, బీమా సౌకర్యం లభించే అవకాశం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆకివీడు మండలంలోని చినకాపవరం గ్రామంలో తెగులు సోకిన పంట(ఫైల్), ధాన్యం ఆరబెట్టిన దృశ్యం
ఖరీఫ్ మాసూళ్లు జరుగుతు న్నాయి. యంత్రాలతో కోతలు పూర్తి చేశాం. పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. ఎకరానికి 35 బస్తాలకు తగ్గదనుకున్నాం. పట్టబడులు పడితే 26 నుంచి 28 బస్తాల దిగుబడి వస్తోంది. పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. ప్రకృతి విళయతాండవం, అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర నష్టానికి గురయ్యాం.
– కోట చైతన్య, రైతు, గుమ్ములూరు, ఆకివీడు మండలం
తగ్గిన ఖరీఫ్ దిగుబడి
తగ్గిన ఖరీఫ్ దిగుబడి


