
క్షేత్రంలో కుక్కల స్వైరవిహారం
అమాంతం దాడి చేశాయి
ఆరు నెలల క్రితమే పట్టించాం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన వస్తున్న భక్తులపై సైతం అవి దాడులకు తెగబడుతున్నాయి. దాంతో వారు బిక్కుబిక్కుమంటూ ఆలయానికి చేరుకుంటున్నారు. శ్రీవారి క్షేత్రానికి నిత్యం అధిక సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన వస్తున్నారు. శుక్ర, శనివారాల్లో ఈ సంఖ్య వేలల్లో ఉంటోంది. రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమవరం పరిసర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దూబచర్ల–రాళ్లకుంట మీదుగా క్షేత్రానికి చేరుకుంటున్నారు. అలాగే ఉయ్యూరు, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భీమడోలు మీదుగా, అదేవిధంగా దగ్గర దారైన తడికలపూడి–వెంకటకృష్ణాపురం మీదుగా వస్తున్నారు. ఈ దగ్గర దారిలో వచ్చే భక్తులు శ్రీవారి పుష్కరణి(నృసింహ సాగరం) వెనుక వైపు నుంచి, గట్టు వెంట చెరువు వీధికి చేరుకుంటున్నారు. అక్కడున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద, దసరా మండప ప్రాంతంలోని ఇళ్ల వద్ద ఆ భక్తులు కాసేపు సేదతీరి, శ్రీవారి ఆలయానికి చేరుకుంటున్నారు.
హడలెత్తిస్తున్న శునకాలు..
పుష్కరిణి ముందు, పుష్కరిణిలోని ర్యాంపుపై వీధి కుక్కలు గుంపులుగా ఉంటున్నాయి. చేతి కర్ర లేని కాలినడక భక్తులపై అవి దాడులకు పాల్పడుతున్నాయి. ఎక్కువగా బాలలు, చిన్నారులపై దాడి చేస్తున్నాయి. ఇటీవల లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కాలినడక భక్తుడు సాయిల రవి కుమారుడు యశ్వంత్‌పై దాడి చేశాయి. కొందరు పరుగులు తీస్తూ వాటి నుంచి తప్పించుకుంటున్నారు. ఈ వీధి కుక్కల బెడద కొండపైన భక్తులకూ తప్పడం లేదు. దేవస్థానం షాపింగ్ కాంప్లెక్స్ వద్ద భక్తులు సంచరించే ప్రాంతాల్లో సంచరిస్తూ, అక్కడే పడుకుంటున్నాయి. అవి ఎక్కడ దాడి చేస్తాయోనని భక్తులు భయపడుతున్నారు.
వైరస్ శునకాలతో ఆందోళన
వీధి కుక్కల్లో ఎక్కువగా వైరస్ సోకినవే ఉంటున్నాయి. శరీరంపై పుండ్లు పడి.. భక్తుల మధ్యలో సంచరిస్తూ, అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నాయి. వైరస్‌తో ఉన్న ఈ కక్కలు కరిస్తే పరిస్థితి ఏంటా.. అని భక్తులు ఆందోళన చెందుతున్నారు. దేవస్థానం అధికారులు అప్పుడప్పుడు కొండపైన, ఆలయ పరిసరాల్లో తిరిగే శునకాలను పట్టిస్తున్నారు. వాటిని పట్టుకుని తీసుకెళ్తున్న వారు అటవీ ప్రాంతంలో విడిచి పెట్టకుండా, గ్రామ శివారుల్లో వదిలేస్తున్నారు.
శ్రీవారి పుష్కరణి ముందు రోడ్డుపై గుంపుగా ఉన్న వీధి కుక్కలు, శ్రీవారి ఆలయ తూర్పు ప్రాంతంలోని షాపింగ్ కాంప్లెక్స్‌ల వద్ద పడుకున్న వీధి కుక్కలు
క్షేత్రంలో స్వైరవిహారం చేస్తున్న వీధి కుక్కలు
కాలినడక భక్తులపై తరచు దాడులు
చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్న భక్తులు
కుటుంబ సమేతంగా కాలినడకన శ్రీవారి క్షేత్రానికి వచ్చాను. పుష్కరిణి గట్టుపై నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్దకు చేరుకోగా, అక్కడున్న వీధి కుక్క మా బాబు యశ్వంత్‌పై దాడి చేసింది. కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సాయంతో పీహెచ్‌సీకి వెళ్లాం. అధికారులు వీధి కుక్కల నుంచి భక్తులకు రక్షణ కల్పించాలి.
– సాయిల రవి, కాలినడక భక్తుడు, లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామం
ఆలయ పరిసరాల్లో తిరిగే వీధి కుక్కలను ఆరు నెలల క్రితమే పట్టించి, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేలా చర్యలు తీసుకున్నాం. మళ్లీ కాలినడక భక్తుల వెంట అవి క్షేత్రానికి చేరుకుంటున్నాయి. వాటిని పట్టిస్తుంటే జంతు ప్రేమికులు ఊరుకోవడం లేదు. పెరిగిన కుక్కలబెడదపై ఆలయ అధికారులతో చర్చించి, తగు చర్యలు తీసుకుంటాం.
– టి.సూర్యనారాయణ, శ్రీవారి దేవస్థానం డీఈ

క్షేత్రంలో కుక్కల స్వైరవిహారం

క్షేత్రంలో కుక్కల స్వైరవిహారం

క్షేత్రంలో కుక్కల స్వైరవిహారం