
కార్తీకానికి క్షేత్రపాలకుడి ఆలయం ముస్తాబు
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రపాలకుడి ఆయలంగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 21 నుంచి కార్తీకమాసం ప్రారంభం కానుంది. ఆలయంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. రూ.4.50 కోట్లతో ఆలయం ముందు చేపట్టిన రాజగోపుర నిర్మాణ పనులు పూర్తి కాగా, ప్రస్తుతం రంగులు వేసే పనులు జరుగుతున్నాయి. కార్తీకమాసం ప్రారంభం నుంచి భక్తులు పూర్తిస్థాయిలో ఈ రాజగోపురంలోంచి రాకపోకలు సాగించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 21న సాయంత్రం 6 గంటలకు ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపాన్ని వెలిగించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. వచ్చేనెల 5న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆరోజు సాయంత్రం ఆలయ ఆవరణలో జ్వాలా తోరణాన్ని, అనంతరం స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.