
మనసున్న మెకానిక్
కై కలూరు: అతనిదో మధ్య తరగతి కుటుంబం.. బండి రిపేరు చేస్తే కాని బతుకు బండి ముందుకు సాగదు. తొమ్మిదేళ్ల క్రితం తండ్రి మరణించాడు. సోదరుడు కూడా మరణించాడు. తల్లి బట్టలు అమ్ముతూ చేదోడుగా మారింది. భార్య, ముగ్గురు సంతానం. కానీ ఎదో వెలితి. పట్టెడన్నం కోసం పరితపిస్తున్న బడుగులకు అన్నదానం చేయాలని సంకల్పించాడు. పేదరికంలో మగ్గుతున్న అభాగ్యులకు ప్రతీ సోమవారం అన్నదాతగా మారాడు. మండవల్లి మండలం పులపర్రు గ్రామానికి చెందిన నీలం నాగరాజు బైక్ మెకానిక్. పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. సాదాసీదా జీవనం. శివుడు అంటే ఇష్టం. శివుడికి ఇష్టమైన సోమవారం పేదలకు అన్నదానం చేయాలని భావించాడు. కై కలూరులో యానాదుల కాలనీ, బస్టాండ్, రైల్వే స్టేషన్, తాలూకా సెంటర్లలో యాచకులు, అనాథలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తాడు.నాగరాజు నాలుగేళ్లగా ప్రతీ సోమవారం పేదల ఆకలి తీరుస్తున్నాడు. కరోనా సమయంలోనూ సేవలు ఆపలేదు. ఇంటి వద్ద కుటుంబ సభ్యులు వంటలు తయారు చేస్తారు. అప్పుడప్పుడు దాతల సాయంతో మరింత మందికి భోజనాన్ని అందిస్తున్నాడు. ఒక వేళ సోమవారం ఇతర ప్రాంతాల్లో ఉంటే అక్కడ కూడా హోటల్‌లో భోజనాలు కట్టించి పేదలకు పంపిణి చేయిస్తాడు. కుటుంబ సభ్యుల ఆదరణ కోల్పోయి వృద్ధాప్యంలో అనేక మంది చాలీచాలని కడుపుతో జీవనం సాగిస్తున్నారని, అలాంటి వారి కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు నాగరాజు తెలిపారు.
నాలుగేళ్లుగా ప్రతి సోమవారం పేదలకు అన్నదానం

మనసున్న మెకానిక్