
ప్రైవేటీకరణ వద్దే వద్దు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నిరసన
నరసాపురం: రాష్ట్రంలో వైద్యకళాశాలను ప్రైవేటు పరం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఎస్సీ సెల్ చేపట్టిన నిరసన కార్యక్రమం నరసాపురంలో విజయవతంగా సాగింది. 30 యాక్ట్‌ను పోలీసులు అమలు చేసినా.. పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో నిరసన గళం వినిపించారు. పేదలు, మధ్య తరగతి వారికి వైద్య విద్యను దూరం చేసి వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదంటూ దళితులు కదం తొక్కారు. ప్రభుత్వం తీరుమారకుంటే రానున్న రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ముందుగా పార్టీ ఎస్సీ సెల్ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా భారీ నిరసన ర్యాలీ చేశారు. వైఎస్సార్‌సీపీ జెండాలు పట్టుకుని ట్యాక్సీ స్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఆటలు సాగనివ్వమని, వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయనివ్వమని నినదించారు. ర్యాలీ అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడీ రాజు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 మెడికల్ కళాశాలల్లో కొన్నింటిలో తరగతులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసి, మెడికల్ కళాశాలలు నడిపించడం చేతకాని కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందన్నారు. మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను విస్మరించడం చంద్రబాబుకు కొత్తకాదన్నారు. పార్టీ యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి గంటా రాహుల్ మాట్లాడుతూ వెంటనే 590 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో వైద్య విద్యను పేద, మధ్య తరగతికి చిక్కేలా చేశారన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనడం దారుణమన్నారు. పార్టీ ఆచంట నియోజకవర్గ పరిశీలకుడు ఖండవల్లి వాసు, నరసాపురం ఎంపీపీ మైలాబత్తుల సోనీ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ హయాంలో ఏర్పాటైన మెడికల్ కళాశాలల విషయంలో కూటమి ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, కౌన్సిలర్లు జిల్లెళ్ల దిలీప్, సిర్రా కాంతమ్మ, పార్టీ ఎస్సీ సెల్ నరసాపురం నియోజకవర్గ అధ్యక్షుడు కోడెల్ల వెంకట్రావు, పార్టీ మేధావుల ఫోరం జిల్లా కన్వీనర్ వంగలపూడి జక్కరయ్య, పార్టీ ట్రేడ్ విబాగం రాష్ట్ర కార్యదర్శి ఎండీ షాన్‌వాజ్‌ఖాన్, ఎస్సీ సెల్ నాయకులు పడవల సత్యనారాయణ, కొల్లాబత్తుల రవికుమార్, కాకిలేటి ఆనంద్, వర్ధనపు చంటి, వర్ధనపు సుధాకర్, తణుకుల చంటి తదితరులు పాల్గొన్నారు.