
కూటమి ప్రభుత్వంలో అవినీతి రాజ్యం
మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం అర్బన్: రాష్ట్రం, నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ అవినీతి పాలన అంతులేకుండా ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దుయ్యబట్టారు. మంగళవారం ఆయన కార్యా లయంలో విలేకరుల సమావేశంలో కొట్టు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రూ.2 లక్షల కోట్లు అప్పుచేసిన చంద్రబాబు ఆ సొమ్మును ఏం చేశాడో లెక్క చెప్పాలన్నారు. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయిందని చెప్పారు. తల్లికి వందనం 87 లక్షల మంది విద్యార్థులకు అందచేయాల్సి ఉండగా కేవలం కొంతమందికే ఇచ్చారన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఇస్తామని గ్యాస్ కొట్టి వదిలారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో లిక్కర్ షాపులు నిర్వహిస్తే రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు గోల చేసి, నిరూపించలేక నోరు మెదపకుండా ఉన్నాడన్నారు. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి పథకాలు అమలు చేయలేని చేతకాని చంద్రబాబు హామీలు ఎందుకు ఇచ్చాడని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు, రైతులకు అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయలేపోయిన అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచాడన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు తమ అవినీతి పాలనన బహిరంగంగానే చెబుతున్నారని కొట్టు ఎద్దేవా చేశారు. మట్టి, ఇసుక, పేకాట, కోడిపందేలు ఏడాది పొడవునా కొనసాగించడం వారికి చెల్లుతుందన్నారు. ఇసుక ఉచితం అంటూనే 6 యూనిట్లకు రూ.16,500 వసూలు చేస్తున్నారన్నారు. కోరుమిల్లి ఎంపీటీసిని మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకొని అభివృద్ధి జరగలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తాను చేసిన అభివృద్ధిని చూపిస్తానని, ప్రస్తుత ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపించాలని చాలెంజ్ విసిరారు. నియోజకవర్గంలో రూ.200 కోట్లుతో మూడు బ్రిడ్జిలు నిర్మిస్తామని చెప్పిన ప్రజా ప్రతినిధి టెండర్లు పిలిచారా? నిధులు మంజూరు చేయించారా? నిర్మాణాలు ఎప్పుడు చేపడుతున్నారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. గతంలో ఇదే ప్రజాప్రతినిధి మున్సిపల్ చైర్మన్‌గా ఎల్‌ఈడీ లైట్ల పేరుతో రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు క్రీడల పేరుతో దోపిడీ చేస్తున్నారన్నారు.