
జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు ద్వారా పశ్చిమగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం కేంద్ర మంత్రి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, కలెక్టర్ చదలవాడ నాగరాణి, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ, ఆర్ డబ్ల్యుఎస్, వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయ, ఉద్యాన శాఖ, పౌర సరఫరాలు తదితర శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని వాటి ఫలాలు ప్రజలకు చేరాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. భీమవరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భీమవరం యనమదుర్రు డ్రెయిన్‌పై అసంపూర్తిగా ఉన్న మూడు వంతెనలకు అప్రోచ్ రోడ్డు వేయాలని, అంచనా వేయగా రూ.36 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. తాడేపల్లిగూడెం, తణుకు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గుంతలు పూడ్చడంతో ప్రయోజనం లేదని, సింగిల్ లేయర్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ప్రచార ప్రక్రియను మంత్రికి వివరించారు.