భీమవరం: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచిపోతున్నా నేటికీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల విద్యా, ఆర్థిక రంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఫ్యాప్టో పోరుబాట కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7న ‘చలో విజయవాడ’కు పిలుపునివ్వడంతో మంగళవారం భీమవరం యూటీఎఫ్ కార్యాలయంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ పీఎస్.విజయరామరాజు, జనరల్ సెక్రటరీ జి.ప్రకాశం నేతృత్వంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. త్వరిత గతిన 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, బకాయి ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి తప్పించి బోధనకు మాత్రమే పరిమితం చేయాలని, ఉపాధ్యాయులకు యాప్‌ల భారం నుంచి విముక్తి కలిగించాలన్నారు. అనంతరం చలో విజయవాడ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మెగా డీఎస్సీ–2025లో ఎంపికై న నూతన ఉపాధ్యాయులకు ఇండక్షన్ ట్రైనింగ్ ఉంటుందని విద్యాశాఖాధికారి వెంకటలక్ష్మమ్మ అన్నారు. ఈ నెల 3 నుంచి 10 వరకు డీఎస్సీలో నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయులు ఇండక్షన్ ట్రైనింగ్‌కు హాజరుకావాలన్నారు. ఈ ట్రైనింగ్ ఎవరికి ఏ విధమైన మినహాయింపులు ఉండవని, ట్రైనింగ్ క్యాంపునకు హాజరుకాని ఉపాధ్యాయులు తదుపరి విడతలో నిర్వహించే ట్రైనింగ్ హాజరైన తరువాత మాత్రమే పోస్టింగ్ ఆర్డర్ ఇస్తారన్నారు. ట్రైనింగ్‌కు అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకోవాలన్నారు. ట్రైనింగ్‌కు హాజరయ్యే నూతన ఉపాధ్యాయుల వారి బెడ్‌షీట్స్, ఇతర వ్యక్తిగత సామగ్రి, ఉదయం జాగింగ్ నిమిత్తం రన్నింగ్ షూస్, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు.
జంగారెడ్డిగూడెం: రోడ్డు నిర్మాణం కోసం ప్రజలు రోడ్డెక్కారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు రోడ్డు నిర్మించాలని మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే నుంచి రావికంపాడు వరకు ప్రధాన రహదారి గోతులతో అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గానీ ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదన్నారు. రోడ్డు దుస్థితిని చూపించే ఉద్దేశంతో పాదయాత్ర చేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటినా రోడ్ల పరిస్థితిలో మార్పు లేదన్నారు. జంగారెడ్డిగూడెం – ఏలూరు రోడ్డు నెల రోజుల్లో నిర్మించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
జంగారెడ్డిగూడెం: పేషెంట్‌పై టెక్నీషియన్ దాడి చేసిన ఘటన జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో జరిగింది. రోగి బంధువులు, ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. తాడువాయి పంచాయతీ గొల్లగూడెంకు చెందిన ములకాల వీరరాఘవులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసు పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. మంగళవారం ఉదయం షిప్ట్‌లో డయాలసిస్ చేయించుకోవాల్సి ఉండగా, ఇంటి వద్ద పని ఉందని, మధ్యాహ్నం షిప్ట్‌కు వస్తానని డయాలసిస్ టెక్నీషియన్ సుధాకర్‌కు విషయం తెలిపారు. ఆయన కుదరదని చెప్పడంతో ఆసుపత్రికి వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఈ క్రమంలో కాలు తిమ్మిర్లు ఎక్కి వీరరాఘవులు కాలుపై కాలువేసుకుని పడుకున్నాడు. అక్కడకు వచ్చిన సుధాకర్ గమనించి వాగ్వాదానికి దిగాడు. మాటా మటా పెరగడంతో సుధాకర్ ట్రేతో వీరరాఘవులపై దాడి చేశాడు. దీంతో పేషెంట్ బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.
సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ