
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక శుభలేఖ కళ్యాణ మండపంలో విద్యుత్ ఉద్యోగుల జేసీ రాష్ట్ర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ కార్మిక సంఘాలు గతంలో ఉద్యమాల ద్వారా సాధించుకున్న ప్రయోజనాలను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీల యాజమాన్యం కార్మిక చట్టాలకు, విద్యుత్ బోర్డ్ విభజనకు ముందు ఉద్యోగ సంఘాలతో కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా గత ఆరు దశాబ్దాల నుంచి అమలులో ఉన్న సర్వీస్ నిబంధనలను ఏకపక్షంగా మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం బోర్డు విభజనకు ముందు అమలులో ఉన్న సర్వీస్ నిబంధనలు, పని ప్రమాణాలు, కారుణ్య నియామకాలు తదితర ప్రయోజనాలు యథావిధిగా కొనసాగుతాయని, ఏవైనా మార్పులు చేయాలంటే ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రస్తుత ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా పరస్పర అవగాహనతో ఒప్పందాలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. అదే విధంగా జీతభత్యాల విషయంలో ప్రస్తుతం అమలులో ఉన్న పరస్పర చర్చల ద్వారా వేతనాలు నిర్ణయించే పద్ధతి ఇకముందు ఏర్పడబోయే సంస్థల్లో కూడా కొనసాగిస్తామని త్రైపాక్షిక ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారన్నారు. కానీ ఇందుకు భిన్నంగా 2022 వేతన సవరణపై నిర్ణయాల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మాజీ ఐఏఎస్ అధికారిని నియమించారన్నారు. పూర్వం నుంచి అమలులో ఉన్న ‘వెయిటేజ్’ ఫార్ములాను రద్దుచేసి, అతి తక్కువ శాతం (8శాతం) ఫిట్మెంట్ బెనిఫిట్‌ను, పాత పద్ధతికి విరుద్ధంగా ఇంక్రిమెంట్లు, మాస్టర్ స్కేలు రూపొందించారని, దీనివల్ల ఉద్యోగులు చాలా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
దశలవారీ ఆందోళనలకు పిలుపు
తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఉద్యోగులు దశలవారీ ఆందోళనా కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ నెల 17, 18 తేదీల్లో అన్ని సర్కిల్ కార్యాలయాల్లో, జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమాయాల్లో ధర్నా, 19, 20 తేదీల్లో సర్కిల్ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు, 22న అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుత ర్యాలీ నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. అప్పటికీ తమ సమస్యలు పరిష్కరించకుంటే అన్ని సంఘాల నాయకులతో చర్చించి భవిష్యత్‌లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎస్.కృష్ణయ్య, కన్వీనర్ రాఘవరెడ్డి, కో కన్వీనర్ కే శేషారెడ్డి, కే శ్రీనివాస్, ఎం.గోపీ, డిస్కమ్ జేఏసీ నేతలు భూక్యా నాగేశ్వరరావు, తురగా రామకృష్ణ, సీహెచ్ సాయిబాబా, జిల్లా నాయకులు ఎం.రమేష్, వీ రాము, అబ్బాస్, కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు ఎం.బాలకాశీ, కే నాగరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుంచి వందలాదిగా ఉద్యోగులు, కార్మికులు, అధికారులు పాల్గొన్నారు.

విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి