
ఉపాధ్యాయుల నిరసన
భీమవరం: ఉపాధ్యాయుల ఆర్థిక, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్)ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలలు పూర్తయినా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే రెండేళ్లు పూర్తయిపోయినా పీఆర్సీ కమిషన్ వేయకపోవడం శోచనీయమని వెంటనే కమిషన్ వేసి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి బీవీ నారాయణ మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, కేంద్రం మెమో నెంబర్ 57 ప్రకారంగా 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు పీఎన్‌వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.