
ప్రభుత్వమే వైద్య కళాశాలలు నడపాలి
పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడమంటే విద్యను వ్యాపారం చేయడమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎస్‌వి గోపాలన్ మండిపడ్డారు. మంగళవారం దగ్గులూరు మెడికల్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ ప్రభుత్వమే వైద్య కళాశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. నాడు మెడికల్ కళాశాల నిర్మాణం కోసం 60 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. ల్యాండ్ ఫిల్లింగ్ పూర్తిచేసి ఫౌండేషన్ ప్రాథమిక స్థాయిలో ఉందన్నారు. ప్రభుత్వం మారడంతో పనులు ఆగాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరంన్నర కావస్తున్నా ఇంతవరకూ నిర్మాణం పనులు కొనసాగించలేదన్నారు. ప్రైవేటు వాళ్లకు అప్పగించడం అన్యాయమన్నారు. ఇప్పటికే విద్యారంగం ప్రైవేటు పరమైందని, దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారన్నారు. ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూడడం దారుణన్నారు. దీనివల్ల విద్య మరింత ఖరీదుగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వమే కళాశాలలను నడపాలని లేదంటే ప్రజా ఉద్యమం లేవనెత్తుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కానేటి బాలరాజు, జవ్వాది శ్రీనివాస్, బాతిరెడ్డి జార్జి, కె క్రాంతిబాబు, గొల్ల ఏడుకొండలు, టి.శ్రీనివాస్, ఎస్.మాణిక్యం, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి డిమాండ్