
వీవోఏల సమస్యలు పరిష్కరించాలి
భీమవరం: వీవోఏల సమస్యలు పరిష్కరించాలంటూ భీమవరం వెలుగు కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి పీవీ ప్రతాప్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వీవోఏలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందన్నారు. స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా వారికి రుణాలు అందించే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న వీవోఏలు కేవలం సభల జన సమీకరణ విషయంలోనే గుర్తుకు వస్తున్నారని దుయ్యబట్టారు. వీవోఏలకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐటీయు జిల్లా నాయకుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ పాలకులు చెప్పుకుంటున్నట్లు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన గొప్పగా ఉంటే ప్రజలు రోడ్డెక్కి ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో వీవోఏల సంఘం జిల్లా కార్యదర్శి నిర్మలాదేవి తదితరులు మాట్లాడారు. అనంతరం వెలుగు పీడీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుడు ఇంజేటి శ్రీనివాస్, వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు నాగిడి గోవిందమ్మ, జి.లక్ష్మి, ఎ.సుబ్బలక్ష్మి, పుష్పలత, రమ్య తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కండక్టర్ వై.కుసుమ కుమారికి మంగళవారం విధులు కేటాయించలేదు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తరువాత బస్సుల్లో మహిళలు పరిమితికి మించి ప్రయాణించడంతో కండక్టర్లు పడుతున్న ఇబ్బందులపై కుసుమకుమారి ఒక వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టినట్టు తెలిసింది. విచారణ పూర్తయ్యేవరకు విధులు కేటాయించకూడదని నిర్ణయించినట్టు సమాచారం. మంగళవారం డిపోలో ఆమెను విచారణ చేసిన అధికారులు.. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి నివేదిక తీసుకున్నట్టు తెలిసింది. ఆ నివేదికను ఆర్టీసీ ఉన్నతాధికారులకు పంపించనున్నట్టు సమాచారం.
ఉండి: జిల్లాలోని ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం, ఆచంటలోని రెండు ప్రభుత్వ ఐటీఐల్లో మిగిలిపోయిన సీట్ల కోసం ఈ నెల 27 సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్ డీ ఆనంద్ వేణుగోపాల్ మంగళవారం తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకుని తప్పనిసరిగా రసీదు పొందాలన్నారు. ఈ నెల 29న నిర్వహించే కౌన్సెలింగ్ సమయంలో రసీదు తప్పనిసరిగా చూపించాలన్నారు. 8వ తరగతి పాస్, పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం వెల్డర్ ట్రేడ్‌లో అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు 9666407468 నెంబరులో సంప్రదించాలన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వేగా జ్యువెలర్స్ ఏలూరు షోరూంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన లక్కీడిప్‌లో గెలుపొందిన విజేతల పేర్లను మంగళవారం ప్రకటించింది. లక్కీ డ్రాలో జగ్గవరానికి చెందిన వి.వీరభద్రరావు, ఏలూరుకు చెందిన ఎస్.సతీష్‌కుమార్, జి.రమేష్, దుగ్గిరాలకు చెందిన వి.సత్యప్రియ, ఏలూరుకు చెందిన బి.శారద గెలుపొందారని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్, మేనేజింగ్ డైరక్టర్ నవీన్ వనమా మాట్లాడుతూ ఆఫర్ల కాలంలో ఆభరణాలు కొనుగోలు చేసిన ఖాతాదారులకు లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటిస్తున్నామని చెప్పారు. అనంతరం విజేతలకు రూ.2 లక్షల విలువైన బంగారు/డైమండ్ నెక్లెస్‌లు బహుమతిగా అందజేశారు. వేగా జ్యువెలర్స్ అన్ని షోరూంలలో రాబోయే దసరా, దీపావళి పండుగలకు, వివాహ వేడుకల కోసం సరికొత్త డిజైన్ల ఆభరణాలను విస్తృత శ్రేణుల్లో అందుబాటులో ఉంచినట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు.