ఉద్యాన పంటల్లో సస్యరక్షణ చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ చర్యలు

Sep 17 2025 7:51 AM | Updated on Sep 17 2025 7:51 AM

ఉద్యా

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ చర్యలు

నూజివీడు: ఇటీవల అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సాగులో ఉన్న ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో నివారణకు చేపట్టాల్సిన చర్యలపై నూజివీడు హెచ్‌ఓ ఆర్‌ హేమ రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. వీటిని ఆచరించి ఉద్యాన పంటలకు నష్టం కలగుకుండా చూసుకోవాలని ఆమె కోరారు.

మామిడిలో...

ఆకులకు 5 గ్రాముల పొటాషియం నైట్రేట్‌ని ఒక లీటర్‌ నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. కాంటాఫ్‌ 2ఎంఎల్‌ లీటర్‌ నీటిలో కలిపి తెగుళ్లు రాకుండా పిచికారీ చేయాలి. బోరాన్‌, జింక్‌ 2ఎంఎల్‌ లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

ఆయిల్‌ పామ్‌లో...

లేత మొక్కలు మువ్వ మునిగినట్లయితే బావిస్టిన్‌ 3 గ్రా లీటరు నీటిలో కలిపి మువ్వలో పోసి మొక్కంతా తడిచేలా పిచికారీ చేయాలి. తోటలో మురుగునీరు బయటకు పంపి 2.5 కేజీల యూరియా, 3.7 కేజీల సింగల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, 2 కేజీల పొటాష్‌ , 50 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్‌, 100 గ్రా బోరాన్‌ ప్రతి మొక్కకు మూడు దఫాలుగా 15–20 రోజుల వ్యవధిలో అందజేయాలి.

కొబ్బరిలో...

కొబ్బరి తోటల్లో వారం రోజుల మించి నీరు నిల్వ ఉన్నట్లయితే మువ్వ భాగం బాగా తడిచేలా కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ లీటర్‌ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఆకులు, గెలలపై 0.1 శాతం పొటాషియం నైట్రేట్‌ను పిచికారీ చేయాలి. కొబ్బరి తోటలు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే ఎరువులు 500 గ్రాముల యూరియా, కేజీ సింగల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, 1.5 కేజీల పోటాష్‌ చెట్టుకి ఇవ్వాలి.

కోకోలో...

కోకో తోటల్లో నిలిచిన వరద నీటిని మురుగు కాలువల ద్వారా బయటకు పంపించి విరిగిన కొమ్మలను కత్తిరించి ఒక శాతం బోర్డో మిశ్రమం లేదా 3 గ్రాముల కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ పేస్టులా పూయాలి. పండు బారిన కోకో మొక్కలకు 13:0:46 లేదా 19:19:19లను 5 గ్రాముల లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఎరువులు 100 గ్రాముల నత్రజని, 40 గ్రాముల సూపర్‌, 140 గ్రాముల పొటాష్‌ ఒక్కో మొక్కకు వేయాలి.

అరటిలో...

మూడు నెలల కంటే చిన్న వయసు గల మొక్కలు 4–5 రోజుల పాటు 2 నుంచి 3 అడుగుల లోతు నీటిలో మునిగినట్లయితే వేరు కుళ్లి మొక్కలు చనిపోతాయి. అలాగే 6 నెలలు దాటిన తోటలు 5 రోజుల కంటే తక్కువ నీటి ముంపునకు గురైనప్పుడు వేరు వ్యవస్థ పాక్షికంగా దెబ్బతింటుంది. మురుగునీటిని కాలువల ద్వారా బయటకు పంపి తేలికపాటి దుక్కు చేసి మొక్క ఒక్కింటికి 100 గ్రాముల యూరియా, 80 గ్రాముల పొటాష్‌ను 20 నుంచి 25 రోజుల వ్యవధిలో 2, 3 దఫాలు వేయాలి. ఆకులకు 5 గ్రాముల పొటాషియం నైట్రేట్‌ని ఒక లీటర్‌ నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేయాలి. సిగటోక ఆకు మచ్చ తెగులుకు ప్రోపికోనజోల్‌ ఒక ఎంఎల్‌ ఒక లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దుంపకుళ్లుకు 25 గ్రాముల బ్లీచింగ్‌ పొడి ఒక లీటర్‌ నీటిలో కలిపి మొదలులో పోయాలి. 15 రోజుల వ్యవధిలో 2–3 సార్లు చేయాలి. తర్వాత మొక్క మొదళ్లలో 50 గ్రాములు సూడోమోనాస్‌ 250 గ్రాముల వేప పిండి కలిపి వేయాలి.

బొప్పాయిలో...

అధిక వర్షాల వలన మొక్కలు పసుపు రంగులోకి మారడం, కాండం కుళ్లు వంటి లక్షణాలు ఉన్నట్లయితే రెడోమిల్‌ 2 గ్రాములు ఒక లీటర్‌ నీటికి లేదా ఎలైట్‌ 2 గ్రాములు ఒక లీటర్‌ నీటికి కలిపి మొక్క మొదలు పోయాలి. పండు ఈగ ఉధృతి ఎక్కువ ఉన్న యెడల మిథైల్‌ యూజినాల్‌ ఎరలను ఎకరాకు 10 నుంచి 15 ఏర్పాటు చేసుకోవాలి. సూక్ష్మ పోషకాలైన జింక్‌ సల్ఫేట్‌ 2.5 గ్రా, బోరాన్‌ 1 గ్రా, యూరియా 10 గ్రా లీటరు నీటికి కలిపి 20 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి.

కూరగాయల్లో...

కూరగాయలపై అధిక వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వర్షాలు ఆగిన వెంటనే 19:19:19 లేదా 13:0:45 లేదా యూరియా వంటి పోషకాలు పిచికారీ చేయాలి. ఎండు తెగులు నివారణకు కాపర్‌ ఆక్సి క్లోరైడ్‌ 3గ్రా లీటరు నీటికి లేదా మెటలాక్సిల్‌తోపాటు మంకోజేబ్‌ 2గ్రా లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి. ఆకు మచ్చ తెగుళ్ల నివారణకు కార్బండిజం ఒక గ్రాము లీటరు నీటికి లేదా మంకోజేబ్‌ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారణకు కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ 3 గ్రాములు లీటరు నీటికి, ప్లాంటమైసిన్‌ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు.

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ చర్యలు 1
1/2

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ చర్యలు

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ చర్యలు 2
2/2

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement