
గురువులపై ‘బోధనేతర’ భారం
ఉపాధ్యాయుల డిమాండ్లు
● యాప్‌ల భారం, పని భారం తగ్గించాలి.
● కేడర్ స్ట్రెంత్ సమస్య పరిష్కరించాలి.
● రెండు నెలల పెండింగ్ జీతాలు విడుదల చేయాలి.
● శిక్షణలో చనిపోతున్న ఉపాధ్యాయులకు ఎక్స్‌గ్రేసియా ఇవ్వాలి.
● డీఏ, ఐఆర్ వంటి హామీలను నెరవేర్చాలి.
● ఆప్షనల్, లోకల్ సెలవుల్లో ఆంక్షలు తొలగించాలి.
● పుస్తకాలు, డైరీల రాత తగ్గించాలి.
భీమవరం(ప్రకాశం చౌక్): ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యా యులు బోధనేతర విధులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం యోగాంధ్ర, పేరెంట్ మీటింగ్స్, యాప్‌లు, శిక్షణ, ఫొటోలు అప్‌లోడ్ వంటి పనులు అప్పగించడంతో వీరంతా విసుగు చెందుతున్నారు. పూర్తిస్థాయిలో బోధన సమయం తగ్గిపోయి మొక్కుబడిగా పాఠాలు చెప్పే పరిస్థితి వస్తోందని, దీంతో విద్యార్థుల విద్యా ప్రమాణాలు తగ్గిపోతాయని అంటున్నారు. బోధనేతర విధులతో పని భారం పెరగడంతో పాటు ఒత్తిళ్లతో ఇబ్బంది పడుతున్నట్టు ఆవేదన చెందుతున్నారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం నిరసనలు, దీక్షలు చేస్తున్నారు.
ఒత్తిళ్లతో ప్రాణాలు కోల్పోయి..
కూటమి ప్రభుత్వం దూరప్రాంతాల్లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయులు ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఇలా జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు శిక్షణకు వెళ్లి ప్రాణాలు కూడా కోల్పోయారు. పాలకొల్లు మండలం అరట్లకట్ల హైస్కూల్ హెచ్‌ఎం మూర్తిరాజు, ఉండి మండలం ఉణుదుర్రులో ఇన్‌చార్జి హెచ్‌ఎం టీవీ రత్నకుమార్ శిక్షణ కార్యక్రమాలకు వెళ్లి మృతి చెందిన ఘటనలతో ఉపాధ్యాయులు భయాందోళన చెందుతున్నారు.
రెండు నెలలుగా జీతాల్లేవ్
పాఠశాలల రేషనలైజేషన్‌లో భాగంగా రీ అపోర్షన్ చేసి బదిలీ చేసిన 300 మంది ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించలేదు. దీంతో వీరంతా ఇబ్బంది పడుతున్నారు.
హామీలు బుట్టదాఖలు
గత ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారు. ఐఆర్, పీఆర్‌సీ, డీఏలు అమలు చేస్తామన్న హామీలు 14 నెలలు గడుస్తున్నా అమలు కాలేదు.
కలెక్టరేట్ వద్ద నిరసన
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉపాధ్యాయులు భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలి పారు. డీఈఓకు వినతిపత్రం సమర్పించారు.
ఉపాధ్యాయులతో ఇతర పనుల చేయిస్తున్న ప్రభుత్వం
పని భారం, ఒత్తిళ్లతో సతమతం
బదిలీ ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాల్లేవు
సమస్యల పరిష్కరానికి నిరసనల బాట
పట్టించుకోని కూటమి సర్కారు