దివ్యాంగుల ఇంటికి చేరని రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల ఇంటికి చేరని రేషన్‌

Jul 28 2025 7:27 AM | Updated on Jul 28 2025 7:27 AM

దివ్య

దివ్యాంగుల ఇంటికి చేరని రేషన్‌

ఆకివీడు : దివ్యాంగులకు రేషన్‌ సరుకులు ఇంటి వద్దకే తీసుకువెళ్లి ఇవ్వాలనే ఆదేశాలను రేషన్‌ డీలర్లు అమలుచేయడం లేదని వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లాడి నటరాజు ఆరోపించారు. ఆకివీడులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చాలాచోట్ల దివ్యాంగులకు రేషన్‌ సరుకులు ఇంటి వద్దకు వచ్చి ఇవ్వడం లేదని, వేలిముద్ర తీసుకుని వెళ్లి షాపు వద్దకు వచ్చి సరుకులు తీసుకోవాలని డీలర్లు చెబుతున్నారన్నారు. డీలర్ల వద్ద ఉన్న జాబితాలో తమ పేర్లు లేకపోతే రేషన్‌ ఇవ్వడం లేదని దివ్యాంగులు వాపోతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. దివ్యాంగుడి పేరు ఉంటే ఆ కుటుంబానికి రేషన్‌ను డీలర్‌ ఇంటి వద్దకు తీసుకువెళ్లి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్‌ డిపోలను దివ్యాంగులకు కేటాయించాలని కోరారు. అంత్యోదయ అన్న యోజన కింద 35 కేజీల బియ్యం దివ్యాంగులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఒంటరి దివ్యాంగులకు ఒంటరి రేషన్‌ కార్డు ఇవ్వాలని నటరాజు కోరారు.

ధర్మస్థల దోషులను శిక్షించాలి

ఏలూరు (టూటౌన్‌): ధర్మస్థల మారణకాండలో దోషులను కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా సమాఖ్య ఏలూరు నగర కమిటీ డిమాండ్‌ చేసింది. ఏలూరు నగర సమితి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కమిటీ నాయకులు అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా, కొండేటి బేబీ, కొల్లూరి సుధారాణి మాట్లాడుతూ కర్ణాటకలోని మంజునాథ ఆలయంలోని ధర్మస్థలలో మహిళల మానప్రాణాలను హరిస్తూ సుమారు 500 మందిని చంపి పూడ్చి పెట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. తక్షణమే ఇందుకు కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. నగర సహాయ కార్యదర్శి కొల్లూరి సుధారాణి, ఉపాధ్యక్షురాలు గొర్లి స్వాతి తదితరులు పాల్గొన్నారు.

ఆకతాయిల వీరంగం

జంగారెడ్డిగూడెం: స్థానిక డాంగేనగర్‌లో ఆకతాయిలు వీరంగం సృష్టించారు. డాంగేనగర్‌ 10వ సచివాలయం సమీపంలో ఆదివారం ఆకతాయిలు మద్యం మత్తులో రోడ్డును అడ్డగించారు. రోడ్డుపై వెళుతున్న మహిళల రాకపోకలకు ఇబ్బంది కలిగించారు. స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి సర్దుమణిగింది. మహిళలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో బహిరంగ మద్యపానం ఎక్కువగా జరుగుతోందని, మందుబాబుల వల్ల రోడ్డుపై వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని అన్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

స్మార్ట్‌ మీటర్లతో ప్రజలపై భారాలు

ఏలూరు (టూటౌన్‌): స్మార్ట్‌ మీటర్ల బిగింపు, విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అధ్యక్షతన స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం ప్రజావేదిక సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణ చైతన్య, సీపీఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు వెంకటేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.రవి మాట్లాడారు. స్మార్ట్‌ మీటర్లు, ట్రూఅప్‌ చార్జీలకు వ్యతిరేకంగా సోమవారం నుంచి ఇంటింటా ప్రచారం, సంతకాల సేకరణ చేపట్టాలన్నారు. ఆగస్టు 5న జిల్లావ్యాప్తంగా విద్యుత్‌ కా ర్యాలయాలు, మండల కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు.

దివ్యాంగుల ఇంటికి చేరని రేషన్‌ 1
1/3

దివ్యాంగుల ఇంటికి చేరని రేషన్‌

దివ్యాంగుల ఇంటికి చేరని రేషన్‌ 2
2/3

దివ్యాంగుల ఇంటికి చేరని రేషన్‌

దివ్యాంగుల ఇంటికి చేరని రేషన్‌ 3
3/3

దివ్యాంగుల ఇంటికి చేరని రేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement