
కంప్యూటర్ సైన్స్‌కే మొగ్గు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంజినీరింగ్‌లో కంప్యూటర్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చదువుతుండగానే ఉద్యోగాలు పొందే అవకాశాలు కేవలం కంప్యూటర్ కోర్సుల ద్వారా మాత్రమే రావడంతో ఆ కోర్సులు కౌన్సెలింగ్‌లో హాట్ కేకుల్లా అయిపోతున్నాయి. సీఎస్‌ఈలో సీటు రాదని తెలిస్తేనే విద్యార్థులు మరో బ్రాంచ్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఇటీవల జరిగిన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో ఇప్పటికే యాజమాన్య కోటా సీట్లు మొత్తం భర్తీకాగా తొలి విడత కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌లో జిల్లాలో ఉన్న 6 ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ సీఎస్‌ఈ బ్రాంచ్ సీట్లు పూర్తిగా భర్తీ అయిపోయాయి.
విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని గుర్తిస్తున్న ఆయా సంస్థలు విద్యార్థులు మూడో సంవత్సరం పూర్తి చేయగానే క్యాంపస్ సెలక్షన్లు, లేదా ఆన్‌లైన్ టెస్ట్‌లు నిర్వహించి వారిని తమ ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నాయి. ఆయా సంస్థల ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా జాబ్ మార్కెట్ ట్రెండ్‌కు అనువుగా కంప్యుటర్ సైన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌న్స్(ఏఐ), ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, మెషీన్ లెర్నింగ్, డైటా సైన్స్ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటికి దేశ విదేశాల్లో అపార ఉద్యోగ అవకాశాలు ఉండడంతో విద్యార్థులు ఈ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్‌లో సీఎస్‌ఈ అనుబంధ కోర్సులైన ఏఐ, ఐఓటీ, డీఎస్, ఎంఎల్ వంటి ప్రత్యేక కోర్సులు చేసిన వారికే ఎక్కువ అవకాశాలు అందివచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
కంప్యూటర్ కోర్సులకు లక్షల్లో ప్యాకేజీలు
కంప్యూటర్ ఆధారిత కోర్సులు పూర్తి చేసిన వారికి వివిధ బహుళ జాతి సంస్థలు లక్షల్లో జీతాలు ఆఫర్ చేస్తున్నాయి. సీఎస్‌ఈ విభాగంలో బీటెక్ పూర్తిచేసిన వారికి ప్రారంభ ప్యాకేజీ రూ.4 లక్షలుగా ఉంటోంది. టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్, మెక్రోసాఫ్ట్, టెక్ మహీంద్ర, ఐబీఎం వంటి కంపెనీలు విద్యార్థుల కోసం క్యూ కట్టడంతో డిమాండ్ పెరిగిపోయింది. నగరంలోని సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2021–25 విద్యా సంవత్సరంలో ఏఐడీఎస్ పూర్తి చేసిన విద్యార్థినికి అమెజాన్ రూ. 46.3 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఆఫర్ చేయడం విశేషం. ఏలూరు జిల్లాకు చెందిన వివిధ కళాశాలల విద్యార్థులు సైతం రూ.10 లక్షలకు పైగా ప్యాకేజీతో ఉద్యోగాలు సంపాదించారు.
30 వరకూ రెండో దశ కౌన్సెలింగ్
మొదటి దశలో సీటు పొందిన విద్యార్థులకు ఇప్పటికే సీట్ల కేటాయింపులు జరిగిపోవడంతో వారిలో 95 శాతానికి పైగా సీటు పొందిన కళాశాలల్లో రిపోర్ట్ చేశారు. మొదటి విడత కౌన్సిలింగ్‌లో తమకు ఆశించిన కళాశాలల్లో సీటు రాని మిగిలిన 5 శాతం మంది రెండో దశ కౌన్సెలింగ్‌కు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మొదటి దశలో సీటు పొందిన కళాశాలలో సదరు విద్యార్థి రిపోర్టు చేయకుంటే ఆ సీటు రద్దయ్యి, రెండో విడత కౌన్సిలింగ్‌లో ఏ కళాశాలలో సీటు కేటాయిస్తే ఆ కళాశాలలోనే తప్పనిసరిగా చేరాల్సిన పరిస్థితి.
రెండవ దశ కౌన్సెలింగుకు ఈ నెల 27 నుంచి షెడ్యూల్ విడుదల చేశారు.
27 నుంచి 30 వరకూ రిజిస్ట్రేషన్
28 నుంచి 30 వరకూ సర్టిఫికెట్ల అప్‌లోడ్
28 నుంచి 31 వరకూ వెబ్ ఆప్షన్లు
ఆగస్టు 1న వెబ్ ఆప్షన్ల మార్పు
ఆగస్టు 4న సీట్ల కేటాయింపు
ఆగస్టు 8న రిపోర్ట్ చేయడానికి తుది గడువు
సీఎస్‌ఈ, అనుబంధ బ్రాంచుల్లో సీటు రాకపోతేనే మిగతా కోర్సుల వైపు చూపు
ఈ నెల 30 వరకూ రెండో విడత కౌన్సెలింగ్
కంప్యూటర్ సైన్స్‌కు పెరుగుతున్న ఆదరణ
ఈ ఏడాది సీటు పంపిణీ వివరాలను పరిశీలిస్తే, కంప్యూటర్ సైన్‌న్స్ అండ్ ఇంజనీరింగ్, దాని అనుబంధ విభాగాలకు విద్యార్థుల నుంచి మంచి ఆదరణ కనిపిస్తోంది. ఇతర ప్రధాన ఇంజినీరింగ్ శాఖలు కూడా గత సంవత్సరంతో పోల్చితే మెరుగైన స్థాయిలో భర్తీ కావడం సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. సమాజంలో వేగంగా మారుతున్న సాంకేతిక పరిణామాల దృష్ట్యా అన్ని ఇంజినీరింగ్ కళాశాలలు విద్య నాణ్యతను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌న్స్, డేటా సైన్‌న్స్, సైబర్ సెక్యూరిటీ వంటి తాజా సాంకేతిక రంగాల్లో నవీకరణలు తీసుకురావాలి. ఇంజినీరింగ్‌లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు తమ రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు తాజా సాంకేతికతలపై సర్టిఫికేషన్ కోర్సులు కూడా చేయడం అత్యంత అవసరం.
–డాక్టర్ మర్లపల్లి కృష్ణ, సీఎస్‌ఈ ప్రొఫెసర్, సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల

కంప్యూటర్ సైన్స్‌కే మొగ్గు