
వైద్యుడి ఇంట్లో భారీ చోరీ
ఏలూరు టౌన్: ఏలూరు శివారు ఆశ్రం హాస్పిటల్‌లో పనిచేస్తున్న వైద్యుడి ఇంట్లో శుక్రవారం పట్టపగటే భారీ చోరీ జరిగింది. ఏలూరు రూరల్ ఆరఽశం ఆస్పత్రిలో దాసరి లోకనాథం సీనియర్ వైద్యుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్యతో కలిసి ఆశ్రం హాస్పిటల్ క్వార్టర్స్‌లోని ఇంట్లో నివాసం ఉంటున్నారు. వ్యక్తిగత పనులపై భార్య ఊరు వెళ్లగా ఆయన ఒక్కరే ఉంటున్నారు. ఈ నేపథ్యం శుక్రవారం ఉదయం యథావిధిగా వైద్యుడు లోకనాథం విధులకు వెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చి చూసుకునే సరికి ఇంటి తాళం చెవులు కనిపించలేదు. కొంతసేపు వెదికిన అనంతరం ఆయనే ఇంటి తాళాలు స్వయంగా పగులగొట్టి లోనికి వెళ్లి చూసేసరికి బీరువా పగులగొట్టి ఉంది. బీరువా లోని సుమారు 70 కాసుల బంగారు ఆభరణాలు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులు, నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వేసిన తాళాలు వేసినట్లే ఉండి లోపల చోరీకి గురికావటంపై ఆయన షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలు విలువ భారీగా ఉంటుందని, ఇక వజ్రాలు విలువ సుమారు రూ.కోటికి పైగా ఉంటుందని సహచర వైద్యులు గుసగుసలాడుతున్నారు. ఈ వజ్రాలు చోరీ ఇంటి దొంగల పనేనా? లేక బయట నుంచి వచ్చిన దొంగలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వృద్ధుడైన డాక్టర్ తన జీవితకాలం సంపాదించిన బంగారు ఆభరణాలు, నగదు అపహరణకు గురి కావడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
70 కాసుల బంగారు ఆభరణాలు, వజ్రాలు, నగదు అపహరణ