
ట్రిపుల్ ఐటీలో కొరవడిన భద్రత
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో భద్రత కొరవడింది. ట్రిపుల్ ఐటీలోని శ్రీకాకుళం ఇంజినీరింగ్ విద్యార్థులు ఉంటున్న ఐ1 హాస్టల్ భవనంలోని మూడో అంతస్తులో ఉన్న హాస్టల్ గదులను ఆగంతకులు లూటీ చేశారు. ఇంజనీరింగ్ తృతీయ సంవత్సర విద్యార్థులు వేసవి సెలవులకు వెళ్లి జూలై ఐదో తేదీ నుంచి తిరిగి రావడంతో హాస్టల్ గదుల్లో చోరీ జరిగిన విషయం వెలుగు చూసింది.
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి చెందిన ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం, మూడో సంవత్సరం విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో ఐ1 హాస్టల్ వసతి గృహంలోని రెండో ఫ్లోర్‌లో నాలుగో సంవత్సరం విద్యార్థులు, మూడో అంతస్తులో తృతీయ సంవత్సర విద్యార్థులు ఉంటున్నారు. మే 15 నుంచి వేసవి సెలవులు ఇవ్వడంతో ఈ 4 విద్యార్థులు తమ సామగ్రినంతా తీసుకొని హాస్టల్ గదులను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ3 విద్యార్థులు మాత్రం తమ దుస్తులను, ట్రాలీ బ్యాగ్‌లను, పుస్తకాలను, షూలను ఇతర సామగ్రిని తమ గదుల్లోనే ఉంచి తాళాలు వేసుకొని ఇళ్లకు వెళ్లారు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ4 విద్యార్థులకు తరగతులు శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోనే నిర్వహిస్తున్నామని, నూజివీడులో ఈ3 పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ శ్రీకాకళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు వచ్చేయాలని ట్రిపుల్ ఐటీ అధికారులు ఫోన్‌లకు మెసేజ్‌లు పెట్టారు. దీంతో వారంతా తమ సామగ్రిని తీసుకెళ్లేందుకు నూజివీడు ట్రిపుల్ ఐటీకి వచ్చి తమ రూమ్‌లకు వెళ్లగా తాళాలు పగులగొట్టి, లోపలి దుస్తులను, పుస్తకాలను చిందరవందరగా పడేసి ఉండటం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. మూడో అంతస్తులో దాదాపు 100 గదులు ఉండగా 30 గదుల వరకు తాళాలు పగులగొట్టి, గడులు పగుల గొట్టి విద్యార్థుల పుస్తకాలను, దుస్తులను చిందరవందరగా పడేయడంతో పాటు సూట్‌కేసులు, ట్రాలీ సూట్‌కేసులు, కొందరి ల్యాప్‌ట్యాప్‌లు, విద్యార్థుల బూట్లు చోరీ చేశారు. ఇంత పెద్ద ఎత్తున లూటీ జరిగినా సమాచారం బయటకు పొక్కకుండా ట్రిపుల్ ఐటీ అధికారులు అది విషయమే కానట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ గదుల్లోని వస్తువులు చోరికి గురికావడంపై విద్యార్థులు మెయిల్ ద్వారా యూనివర్సిటీ ఛాన్సలర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. హాస్టల్ గదులకు కూడా భద్రత లేకపోతే ఎలాగని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
సెక్యూరిటీ వ్యవస్థ నిద్రపోతోందా..!
ట్రిపుల్ ఐటీలో 24 గంటలూ సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. షిఫ్టుకు 55 మంది చొప్పున మూడు షిఫ్టులు విధుల్లో ఉంటారు. అలాగే హాస్టల్ భవనంలో నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన కేర్ టేకర్, శ్రీకాకుళంకు చెందిన కేర్ టేకర్‌లు విధుల్లో ఉంటారు. హాస్టల్ భవనం వద్ద సైతం 24 గంటలూ సెక్యూరిటీ సిబ్బంది కాపలా కాస్తూ ఉంటారు. అంతేగాకుండా ట్రిపుల్ ఐటీలో పోలీస్ అవుట్‌పోస్టు సైతం ఉంది. అయినప్పటికీ విద్యార్థుల రూమ్‌ల తాళాలు పగులగొట్టి, గడులను విరగ్గొట్టి చోరీలకు పాల్పడటం సంచలనంగా మారింది. గతంలో రెండు సార్లు ఫ్యాకల్టీ గృహాల్లో సైతం దొంగతనాలు జరిగాయి. వాటికి సంబంధించి దర్యాప్తు ఇంత వరకు అతీగతీ లేదు. ఇప్పుడు తాజాగా విద్యార్థుల హాస్టల్ గదుల్లో జరగడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికై నా చోరీకి పాల్పడిన వారు ఎవరో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత యాజమాన్యంపైన, పోలీసులపైనా ఉంది.
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల హాస్టల్ గదుల లూటీ
పలు రూమ్‌ల తాళాలు పగులగొట్టి, గడులు విరగ్గొట్టి చోరీ
విద్యార్థులు వేసవి సెలవులకు వెళ్లి వచ్చాక వెలుగు చూసిన వైనం

ట్రిపుల్ ఐటీలో కొరవడిన భద్రత

ట్రిపుల్ ఐటీలో కొరవడిన భద్రత