
గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
తణుకు అర్బన్: కలెక్టర్‌కు చెప్పుకుందాం రండి కార్యక్రమంలో గీత కార్మికులు వారి కుటుంబాలు, పాల్గొనాలంటూ సోమవారం తణుకు మండలం తేతలి గ్రామంలో గీత కార్మికులు కరపత్రాలను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి మాట్లాడుతూ బెల్టు షాపు పెడితే తాట తీస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తున్నా జిల్లాలో సుమారు 4వేల బెల్ట్ షాపులు అక్రమంగా నడుస్తున్నాయని విమర్శించారు. గీత కార్మికులకు ఉపాధి కల్పించాలని, అలాగే ఏడాదిలో పనిలేని 8 నెలలను వర్క్ హాలిడేగా ప్రకటించి ప్రభుత్వం సాయం చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు ఇస్తున్నట్లుగా రూ.20వేలు అందించాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 14వ తేదీన గీత కార్మికులు కలెక్టరేట్‌కు ఐక్యంగా వచ్చి సమస్యలను తెలియజేయాలని పిలపునిచ్చారు. కార్యక్రమంలో గీత కార్మికులు కాసాని శ్రీనివాసు, కట్టా శ్రీరామమూర్తి, అయినా నాగులు, ఆరెవెల్లి సీతారామయ్య, అంగర పోతురాజు, చేబ్రోలు రాజు, ఆరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని గిరిజనుడి మృతి
వేలేరుపాడు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని గిరిజన యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామవరం గ్రామానికి చెందిన మడకం ప్రకాష్ మొహర్రం (పీర్లపండుగ)ను పురస్కరించుకొని సోమవారం మధ్యాహ్నం కన్నాయిగుట్ట గ్రామానికి తన ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. వేలేరుపాడు మండల పరిధిలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడ్ని వైద్యం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రకాష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేలేరుపాడు ఎస్సై నవీన్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.