
కార్మిక సంఘాల సమ్మె విజయవంతం
భీమవరం: కార్మిక హక్కులను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన కార్మిక సమ్మె బుధవారం భీమవరంలో విజయవంతమైంది. ఏఐటీయూసీ, సీఐటియూ ఆధ్వర్యంలో పట్టణంలో వేర్వేరుగా ర్యాలీలు, సభలు నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి కార్మికులు తాలూకా ఆఫీసు సెంటర్, ప్రకాశంచౌక్, అంబేడ్కర్ సెంటర్ మీదుగా జువ్వలపాలెం రోడ్డులోని వెంకటేశ్వరస్వామి గుడి వరకు, అక్కడ నుంచి తిరిగి ప్రకాశం చౌక్ సెంటర్‌కు చేరుకున్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, ఏఐటీయూసీ కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు, రాష్ట్ర నాయకుడు ఖాదర్ బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్‌లు అమలయితే కార్మికులు జీవించే హక్కు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పనికి తిలోదకాలిస్తూ 12 గంటలు పని తీసుకురావడం అత్యంత దుర్మార్గమన్నారు. సమ్మెలో భాగంగా పోస్టాఫీసు, బ్యాంకులు, వాణిజ్య సంస్ధలను మూసివేయించారు. సీఐటీయూ కార్యాలయం వద్ద నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో పట్టణంలో ఎర్రజెండాలు చేతపట్టి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తూ చట్టాలు మారుస్తుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలు మద్దతు పలకడం దారుణమని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరామ్ మాట్లాడుతూ దోపిడీ పాలకులకు ఓట్లు వేసినంత కాలం కార్మికుల బతుకుల్లో వెలుగు రాదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరరావు, యూనియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు కె.భువనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.