
నిశ్శబ్ద విప్లవం రసాయన శాస్త్రం
తాడేపల్లిగూడెం: ప్రపంచాన్ని మార్చే నిశ్శబ్ద విప్లవం రసాయన శాస్త్రమని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రసన్నశ్రీ అన్నారు. పట్టణంలోని నన్నయ్య వర్సిటీ ప్రాంగణంలో బుధవారం ప్రారంభమైన రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆర్గానిక్ అనలైటికల్ అండ్ ఫార్మాస్యూటికల్ డెవలప్‌మెంట్ అంశంపై అంతర్జాతీయ సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడారు. మానవ జీవనంలో రసాయన శాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కోవిడ్ మహమ్మారి తర్వాత ఆరోగ్య వ్యవస్థ సంస్కరణలలో అద్భుతమైన పురోగతి సాధించామన్నారు. మానవ జీవితంలో కెమిస్ట్రీ, ఫార్మసీ పాత్ర కీలకమైందన్నారు. జన్యు చికిత్స వైద్యం, అనేక ఆవిష్కరణల వైపు ఫార్మా పరిశ్రమ అభివృద్ధి చెందుతోందన్నారు. కెమిస్ట్రీలో ఇటీవలి ధోరణులు, పురోగతి గురించి చర్చించడానికి ఈ సదస్సు చక్కని వేదిక అవుతుందన్నారు. రోవాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెవీ రామానుజాచారి, చైనా సైంటిస్టు ఎన్.నాగన్న, నిట్ వరంగల్ ప్రొఫెసర్ పి.నాగేశ్వరరావు, గూడెం క్యాంపస్ ప్రిన్సిపాల్ టి.అశోక్ తదితరులు పాల్గొన్నారు.