
నిట్‌లో సీట్లు ఫుల్
తాడేపల్లిగూడెం: జాయింట్ సీట్ అలొకేషన్ అఽథారిటీ (జోసా) పర్యవేక్షణలో జాతీయ విద్యాసంస్థలైన నిట్ తదితర సంస్థల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు రౌండ్లు ముగియగా మరో ఆరు రౌండ్లు మిగిలాయి. తొలి విడతలోనే ఏపీ నిట్‌లో ఉన్న 480 సీట్లకు ఆప్షన్లను విద్యార్థులు ఎంపిక చేసుకున్నారు. మొదటి రౌండ్‌లోనే సీట్లు భర్తీ అయ్యాయి. నిట్‌లో ఉన్న ఎనిమిది బ్రాంచిలలో చేరడానికి విద్యార్థులు ఫ్లోట్ ( బ్రాంచి మారడానికి వీలుగా) ఫ్రీజింగ్ ( సీటు నిర్ధారణ చేసుకోవడం)వంటి ఐచ్ఛికాలను ఎంపిక చేసుకున్నారు. హోమ్ స్టేట్ కోటా కింద 240 మంది, అదర్ స్టేట్ కోటా కింద 240 మంది ఆప్షన్లను ఎంపిక చేసుకోగా, మిగిలిన నాలుగు రౌండ్లు ముగిసిన తర్వాత వెరిఫికేషన్ కేంద్రాల్లో జోసా నుంచి తుది జాబితా వచ్చిన తర్వాత సర్టిఫికెట్లను పరిశీలన చేసిన తర్వాత నిట్‌లో విద్యార్థులు చేరే ప్రక్రియ పూర్తి కానుంది. తర్వాత ఇండక్షన్, తరగతుల ప్రారంభం కార్యక్రమాలు జరగాల్సి ఉంది. ఆగస్టు నెల వరకు విద్యార్థులు ప్రాంగణానికి వచ్చే అవకాశాలు లేవు.
ఎంటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ షురూ
కొంతకాలం విరామం తర్వాత ఏపీ నిట్‌లో ఎంటెక్ కోర్సు ప్రారంభం కానుంది. ఎంటెక్ కోర్సులో ఇక్కడ 99 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైంది. వంద సీట్లు పైన ఉంటేనే ఆయా నిట్‌కు వెరిఫికేషన్ సెంటర్ ఇస్తారు. ఏపీ నిట్‌లో 99 సీట్లు ఉండటంతో ఇక్కడకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం నిట్ రాయపూర్‌లో ఏర్పాటుచేశారు.
హెఫా నిధుల కోసం నిరీక్షణ
ఏపీ నిట్‌లో రెండోదశ పనుల కోసం రూ.430 కోట్ల ప్రతిపాదనతో కెనరా బ్యాంకు ద్వారా హైర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏజన్సీ(హెఫా) నుంచి నిధుల కోసం కేంద్ర ఉన్నత విద్యాశాఖకు వినతులు పంపారు. ఏపీ నిట్‌కు బోర్డు ఆఫ్ గవర్నెన్సు(బీఓజీ) చైర్మన్ లేకపోవడం, పాత చైర్‌పర్సన్ పదవీకాలం ముగిసి ఏడాది గడుస్తున్నా , ఇంకా ఆ స్థానంలో చైర్మన్ ఎంపిక జరుగలేదు. నిధుల్లో కదలిక లేకపోవడానికి ఇది ఒక కారణంగా తెలుస్తోంది.
ఆరో రౌండ్ తర్వాత చేరికలు
ఎంటెక్ తరగతులు త్వరలో ప్రారంభం
హెఫా నిధుల కోసం నిరీక్షణ