
వైఎస్ పాలనలో ఏజెన్సీలో అభివృద్ధి పరుగులు
బుట్టాయగూడెం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. సోమవారం సాయంత్రం దుద్దుకూరులో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్సార్‌తో ఆయనకున్న అనుబంధం, వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమై డ్రాప్‌ఔట్స్‌గా మిగులుతున్న సమయంలో జూనియర్, డిగ్రీ, ఐటీఐ, పాల్టెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యల్లో ముందుకు సాగే విధంగా వైఎస్ కృషి చేశారన్నారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో 70 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిన ఘనత వైఎస్సార్‌దే అని అన్నారు. 400 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణానికి కృషి చేసి రహదారుల సమస్య లేకుండా చేశారన్నారు. అదేవిధంగా అటవీ హక్కుల చట్టంలో సుమారు 10 వేల ఎకరాలకు పైగా భూములను పేదలకు వైఎస్సార్ పంచడం జరిగిందని గుర్తుచేశారు. రూ. 26 కోట్ల వ్యయంతో గిరిజనుల బీడు భూములకు సాగు నీరు అందించే విధంగా పోగొండ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి ఏటా కొండ కాలువల ప్రవాహానికి అనేక మంది గిరిజనులు మృతి చెందుతుంటే వాటిని నివారించేందుకు రూ.26 కోట్లతో నాలుగు ప్రదేశాల్లో హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి కృషి చేశారన్నారు.
వైఎస్ చలువతోనే పోలవరం ప్రాజెక్టు
పోలవరం మండలంలో ప్రతి ఏటా గోదావరి వరదనీరు ప్రవాహానికి 50 వేల ఎకరాల పంట భూములు ముంపునకు గురై రైతులు అనేక ఇబ్బందులు పడేవారన్నారు. దీంతో చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వైఎస్ చలువతోనే ప్రారంభమైందని చెప్పారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సుమారు రూ.70 కోట్లతో కొవ్వాడ ఔట్‌పాల్స్ క్లూయిస్ పనులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. అలాగే గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని 5 ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు జంగారెడ్డిగూడెంలో 100 పడకల నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. ఇలా వైఎస్సార్ పాలనలో తాము ఏ సమస్య అయినా దరఖాస్తు రూపంలో అందజేస్తే వెనువెంటనే నిధులు మంజూరు చేసేవారని చెప్పారు. నాడు వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులను చూసి రాజశేఖరరెడ్డిని దేవుడిగా కొలుచుకుంటున్నారని చెప్పారు. మళ్లీ అదే రీతిలో తండ్రి బాటలో పాలన చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజన ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని చెప్పారు.