హక్కులు, బాధ్యతలను గౌరవించాలి | - | Sakshi
Sakshi News home page

హక్కులు, బాధ్యతలను గౌరవించాలి

Nov 27 2026 1:02 AM | Updated on Nov 27 2026 1:02 AM

న్యూశాయంపేట: భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరు గౌరవించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌ సమావేశపుహాల్‌లో భారత గురువారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించి అధికారులతో ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ విలువలు, ఆశయాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మీసాల ప్రకాశ్‌, అదనపు కలెక్టర్లు ఎల్‌.కిశోర్‌కుమార్‌, వైవీ గణేశ్‌, అధికారులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థుల ఎంపిక

గీసుకొండ: 70వ ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి అండర్‌–19 హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌ కమ్‌ సెలక్షన్స్‌కు మండలంలోని కొనాయమాకుల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన విజయ్‌కుమార్‌ (సీఈసీ ప్రథమ సంవత్సరం), డి. దేవ్‌నాయక్‌ (బైపీసీ ప్రథమ సంవత్సరం) విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించడంతో పాటు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ కె.శోభాదేవి తెలిపారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కె. శోభాదేవి విద్యార్థులను అభినందించి రూ.1,000 నగదు బహుమతి అందజేశారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్‌ లెక్చరర్‌ చందా రమణాకర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఇన్‌్‌చార్జ్‌ పులి ప్రసాద్‌, ఎండీ ఇస్రత్‌, ‘కిల్‌ ద క్యాన్సర్‌’ ప్రోగ్రాం ఆఫీసర్‌ పి.వెంకట్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడి మృతి

ఖానాపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన బుధరావుపేటలో చోటుచేసుకుంది. ఎస్సై గుగులోత్‌ రామ్మోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం భూపతిపేట జీపీ పరిధిలోని కొత్తపల్లెకు చెందిన తేజావత్‌ వెంకటేశ్‌ (23)ఖానాపురం మండలంలోని ఐనపల్లి ఐటీఐలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన తేజావత్‌ నవీన్‌ హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, భూపతిపేట పరిధిలోని కారంపొడితండాలో శుభకార్యం ఉండడడంతో నవీన్‌ హైదరాబాద్‌ నుంచి నర్సంపేటకు వచ్చాడు. విందు అనంతరం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లేందుకు వరుసకు సోదరుడైన వెంకటేశ్‌ను ద్విచక్ర వాహనంపై నర్సంపేట బస్టాండ్‌లో దింపాలని కోరాడు. దీంతో ఇరువురు కలిసి ద్విచక్రవాహనంపై నర్సంపేటకు వస్తుండగా బుధరావుపేట శివారులోకి రాగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను చీకట్లో గమనించకుండా వెనుకనుంచి ప్రమాదవశాత్తు డీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై వెంకటేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్‌కు సైతం తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సహకారంతో పోలీసులు సీపీఆర్‌ చేసి 108లో నర్సంపేటకు తరలించారు. పరిస్థితి విషమంగా అక్కడి నుంచి నవీన్‌ను వరంగల్‌కు తరలించారు. మృతి చెందిన వెంకటేశ్‌కు తల్లిదండ్రులతో పాటు సోదరి ఉన్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి వివరాలు సేకరించారు.

30 మంది టీచర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ

కాళోజీ సెంటర్‌: దుగ్గొండి మండలం పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 30 మంది ఉపాధ్యాయులు గురువారం డీఎస్‌ఈ ఎఫ్‌ఆర్‌ఎస్‌లో ఆలస్యంగా హాజరు నమోదు చేసినట్లు డీఈఓ ఎన్‌.ప్రశాంత్‌రెడ్డి గుర్తించారు. ఈ మేరకు ఉపాధ్యాయులకు ఆయన షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని డీఈఓ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలితే టీజీసీపీఏ రూల్స్‌ 1991 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement