● పట్టాల భద్రత కాదని..
సంబంధం లేని పనుల అప్పగింత
● వరంగల్ రైల్వే సెక్షన్‌లో అధికారుల తీరుపై విమర్శలు
ఖిలా వరంగల్: రైల్వేపట్టాల భద్రతను పర్యవేక్షించాల్సిన ట్రాక్‌మెన్లతో చెత్తచెదారం తొలగించే పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రైల్వే ట్రాక్‌ల నిర్వహణ, తనిఖీలు, పెట్రోలింగ్ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఇంజనీరింగ్ విభాగం సిబ్బందిని పారిశుద్ధ్య పనులకు వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ రైల్వే సెక్షన్లలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టాల మధ్య పేరుకుపోయిన కుళ్లిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, గాజు పెంకులను ట్రాక్‌మెన్‌తో తొలగిస్తున్నట్లు సమాచారం. కనీస రక్షణ పరికరాలు కూడా అందించకపోవడంతో ఈ పనులు చేస్తున్న ముగ్గురు కార్మికులు వాంతులతో ఆస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. విధుల పేరుతో తమ ఆరోగ్యంతో చెలగాట మాడుతున్నారని ట్రాక్‌మెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెత్త తొలగింపుకాదు.. ట్రాక్‌మెన్ విధులివీ..!
రైల్వేవ్యవస్థలో ట్రాక్‌మెన్ పాత్ర అత్యంత కీలకం. పట్టాల తనిఖీలు, ట్రాక్‌ప్యాకింగ్, స్లీపర్ల పరిశీలన, బలాస్ట్ నిర్వహణ, రైల్వే లైన్లపై పెట్రోలింగ్, పాయింట్లు, క్రాసింగ్‌ల తనిఖీలు, గ్రీజింగ్ వంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఇంతటి కీలకమైన సిబ్బందిని వారి ప్రధాన విధులనుంచి తప్పించి పారిశుధ్ద్య పనులకు వినియోగిస్తే ట్రాక్ నిర్వహణపై ప్రభావం పడుతుందన్న అందోళన వ్యక్తమవుతోంది. పారిశుద్ధ్య పనులకు అదనపు సిబ్బందిని నియమించుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
చేయకుంటే వేతనంలో కోత..
ఇదెక్కడి న్యాయం..?
పారిశుద్ధ్య పనులు చేసేందుకు నిరాకరిస్తే వేతనాల్లో కోత విధిస్తామని, క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని పైస్థాయి అధికారులు బెదిరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఆదేశాలు కాదనలేక, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేయాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. వరంగల్ రైల్వేసెక్షన్‌లో జరుగుతున్న ఈ వ్యవహారంపై సంబంధిత ఇంజనీరింగ్ అఽధికారులు, డివిజన్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కార్మికులు కోరుతున్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై (పీబ్ల్యూఐ) సంబంధిత అధికారి శివాంజనేయులును ఫోన్‌లో వివరణ కోసం సంప్రదించగా స్పందించలేదు.


