ఖిలా వరంగల్: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను అధిగమించి, భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. జాతీయ ఉద్యాన అభివృద్ధి మిషన్ ఆధ్వర్యంలో రైతులు తమ పంట పొలాల్లో నీటి కుంటలను (ఫామ్‌పాండ్స్) నిర్మించుకోవడానికి 50 శాతం రాయితీ అందిస్తోంది. లోటు వర్షపాతంతో జిల్లాలో బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. సకాలంలో నీరు అందక పంటల దిగుబడి తగ్గిపోతోంది. ఈ సమస్యలకు ప్రత్యామ్నాయంగా నీటి నిల్వలపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వం నీటి కుంటల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది. కాగా, జిల్లాలో 13,542 మంది రైతులు 25,201 ఎకరాల్లో వివిధ ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు.
నిర్మాణం..
రైతులకు ఉపయోగకరమైన నీటి సంరక్షణ కోసం ప్రతీ నీటికుంట 20 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు ఉండాలి. 14 అడుగుల పరిమాణం, బండ్‌పై భూమి ఎత్తు 0.5 మీటర్లు, అందులో తప్పనిసరిగా 500 మైక్రాన్ల పాస్టిక్ కవర్ వేయాలి. దీంతో నీరు భూమిలోకి ఇంకిపోకుండా ఉంటుంది. సక్రమంగా నీటికుంట నిర్మిస్తే ఒక్కో దాని ద్వారా సుమారు 8.94 లక్షల లీటర్ల నీటిని నిల్వ (ఆదా) చేసుకోవచ్చని జిల్లా ఉద్యాన అధికారి పేర్కొన్నారు. ఒక్కో ఫామ్‌పాండ్‌కు సుమారు రూ.1.80 లక్షల వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తోంది. అంటే పంట పొలంలో నీటి కుంట నిర్మించుకుంటే రూ.90 వేల రాయితీ నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తామని జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
ప్రయోజనాలు..
ఎల్‌నినో పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ తోటలో నీటి సంరక్షణ బాధ్యత మనచేతిలో ఉంటుంది. నీటి నిల్వ కోసం ఫామ్‌పాండ్ నిర్మాణం చేయడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. నీటి నిల్వలే కరువు పరిస్థితుల్లో రేపటి పంటలకు బంగారు భవిష్యత్ ఇవ్వనున్నాయి. ఫామ్‌ఫండ్ నిర్మాణంతో వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి చెట్టు చుట్టూ నీరు అందుబాటులో ఉంటుంది. చెట్టు వృద్ధితో నాణ్యమైన దిగుబడి ఇస్తుంది. తేమను నిలిపి మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పంటలకు అవసరమైనప్పుడు నీటిని సరఫరా చేసి మొక్క ఎదుగుదలకు ఉపయోగించుకోవచ్చు. తర్వాత దశలవారీగా మిగిలిన ఉద్యాన పంటలకు ఈ పథకాన్ని విస్తరించనుంది.
ఒక్కో ఫామ్‌పాండ్‌కు
రూ.90 వేల రాయితీ
8.94 లక్షల లీటర్ల నీటి నిల్వ..
పెరగనున్న భూగర్భ జలాలు
జిల్లాలో 13,542 మంది రైతులు.. 25,201 ఎకరాల్లో ఉద్యాన పంటలు
10 వరకు దరఖాస్తు గడువు
జిల్లాలో ఉద్యాన పంటలసాగు
వివరాలు (ఎకరాల్లో)
పంట రైతులు విస్తీర్ణం
మామిడి 1,651 5,847
అరటి 291 484
బొప్పాయి 98 140
పండ్లతోటలు 345 659
కూరగాయలు 2,064 1,814
మిర్చి 3,940 5,134
పసుపు 1,240 1,539
పూలు 316 359
ఆయిల్‌పామ్ 2,241 6,782
సామాజిక వనాలు 1,258 2,279
మల్బరీ 98 164
13,542 25,201
రైతు పథకానికి దరఖాస్తు చేయాలంటే భూమిపాస్ పుస్తకం, రైతు అధార్‌కార్డు జిరాక్స్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ పథకానికి ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు అర్హులని అధికారులు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన రైతులు జిల్లా కేంద్రంలోని జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో ఈనెల 10వ తేదీ వరకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. మిగతా వివరాలకు ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించవచ్చు.
రైతులు దరఖాస్తు చేసుకోవాలి..
ఎల్‌నినో పరిస్థితుల్లో నీటి నిల్వ కోసం ఫామ్‌పాండ్ నిర్మాణానికి ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఒక్కో యూనిట్ ధర రూ.1.80 లక్షలు కాగా.. ఆయిల్‌పామ్ తోటల రైతులకు రూ.90 వేలు సబ్సిడీ వస్తుంది. అక్టోబర్ 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆసక్తిగల రైతులు నీటికుంట నిర్మాణానికి దరఖాస్తులు చేసుకోవాలి. మరింత సమాచారం కో సం ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలి.
– ఆర్.శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన,
పట్టు పరిశ్రమల అధికారి


