కాశిబుగ్గ: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో ఎల్‌బీ నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది వంటివని, ప్రజలు తమ ఓటు హక్కు ద్వా రా ఎన్నుకునే ప్రభుత్వాలే ప్రజాస్వామ్యానికి అసలైన ప్రతినిధులని అన్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల వ్యవస్థపైనే అనుమానాలు కలిగే పరిస్థితి రావడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ నెల 7న వరంగల్ పోచమ్మ మైదాన్ నుంచి హనుమకొండ అంబేడ్కర్ వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుడు అయూబ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలకు కీలకమైన ఎన్ని కల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. సమావేశంలో మేరు సంఘ కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట్రాజం, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరవి పరమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ బస్మీయా, రత్నమాల, సయ్యద్ ఫైజుల్లా, టీ డీపీ నాయకుడు రఘు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా నాయకుడు హకీమ్ నవీద్ పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు


