హిమం నుంచి సాగరం వరకు.. | - | Sakshi
Sakshi News home page

హిమం నుంచి సాగరం వరకు..

Oct 5 2026 1:27 AM | Updated on Oct 5 2026 1:27 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ‘హిమం’ అంటే చలి.. మంచు.. కశ్మీర్‌ గుర్తొస్తుంది. ‘సాగరం’ అంటే సముద్రం.. కన్యాకుమారి గుర్తుకొస్తుంది. ఈ రెండు భిన్న భౌగోళిక ప్రపంచాలను ఒకే రైలు పట్టాలపై కలిపితే అదే హిమసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌. దేశంలోని ఒక చివర నుంచి మరో చివర వరకు ప్రజలను తీసుకెళ్తున్న ఈ సుదూర రైలు 1984 అక్టోబర్‌ 3న తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పట్లో జమ్ముతావి–కన్యాకుమారి మధ్య నడిచిన ఈ రైలు.. ఆ తర్వాత దేశంలోనే అత్యంత దూరం నడిచే రైళ్లలో ఒకటిగా నిలిచింది. 2015లో జమ్ముతావి బదులు శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా వరకు పొడిగించారు. ఇప్పుడు ఈ రైలుకు 42 ఏళ్లు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు ప్రయాణికులను మోస్తున్న ఈ రైలు ప్రస్తుతం భారత రైల్వేలో మూడో అత్యంత సుదూర రైలు సర్వీసుగా కొనసాగుతోంది. సుమారు 3,790 కి.మీ. దూరాన్ని దాదాపు 70 గంటల ప్రయాణంలో కవర్‌ చేస్తోంది.

12 రాష్ట్రాల మీదుగా..

హిమసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ దేశ భౌగోళిక వైవిధ్యానికి ఒక కదిలే అద్దం. జమ్మూకశ్మీర్‌ నుంచి ప్రారంభమై పంజాబ్‌, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, రాజ స్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు మీదుగా ప్రయాణిస్తుంది. 12 రాష్ట్రాల మీదుగా సాగుతున్న ఈ సుదూర ప్రయాణం భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఒకే రైలులో ప్రయాణిస్తే.. ఉత్తర భారత వాతావరణం నుంచి దక్షిణ భారత తీరప్రాంత వాతావరణం వరకు మార్పును ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆధ్యాత్మిక పర్యటనకూ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. కాట్రాలోని శ్రీమాతా వైష్ణోదేవి నుంచి ప్రారంభమైన ప్రయాణం.. మార్గమధ్యలో తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలను కలుపు తూ చివరికి కన్యాకుమారి వరకు తీసుకెళ్తుంది.

అప్పట్లో ‘లాంగెస్ట్‌’.. ఇప్పుడు మూడో స్థానం

హిమసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ దేశంలోనే అత్యంత దూరం నడిచే రైలు ప్రయాణాల్లో అగ్రస్థానంలో ఉండేది. 2011లో దిబ్రూగఢ్‌–కన్యాకుమారి వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ రావడంతో ఆ రికార్డు మారింది. ప్రస్తుతం వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌, అరొనై సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ల తర్వాత హిమసాగర్‌ మూడో స్థానంలో ఉంది. దేశాన్ని కలపడానికి రైల్వే పట్టాలు వేసిన కాలంలో పుట్టిన ఈ రైలు.. నాలుగు దశాబ్దాల తర్వాత కూడా ‘హిమం నుంచి సాగరం వరకు.. భారతదేశం ఒక్కటే’ అనే భావనకు కదిలే చిహ్నంగా నిలుస్తోంది.

వరంగల్‌కు ప్రత్యేకమైన అనుబంధం

హిమసాగర్‌ ప్రయాణంలో ఉమ్మడి వరంగల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రైలు తెలంగాణలో రామగుండం, వరంగల్‌, ఖమ్మం స్టేషన్లలో మా త్రమే ఆగుతుంది. వరంగల్‌లో ఒక నిమిషం, ఖమ్మంలో మరో నిమిషం మాత్రమే ఆగుతుంది. రైలు వరంగల్‌ స్టేషన్‌కు చేరుకునే సమయం సుమారు 16:09 గంటలు కాగా.. 16:10కే బయలుదేరుతుంది. అంటే ప్రయాణికుడు రైలు ఎక్కడానికి, దిగడానికి కూడా గడియారం కన్నా వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిందే అన్నమాట. కాగా, హిమసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌కు కాజీపేటలో స్టాప్‌ లేదు. ‘కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ ఉంది. కాజీపేట నుంచి హిమసాగర్‌ కు మాత్రం కనెక్షన్‌ లేదు’ అంటూ రైల్వే ప్రయాణికులు సరదాగా వ్యాఖ్యానించే పరిస్థితి.

వరంగల్‌ మీదుగా హిమసాగర్‌

ఎక్స్‌ప్రెస్‌ 42 ఏళ్ల ప్రయాణం

కశ్మీర్‌ కొండల నుంచి కన్యాకుమారి సముద్రతీరం వరకు..

3,790 కిలోమీటర్ల దూరం..

70 గంటల సుదీర్ఘ జర్నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement