ఇండెంట్‌ ఇస్తేనే బ్రేక్‌ ఫాస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇండెంట్‌ ఇస్తేనే బ్రేక్‌ ఫాస్ట్‌

Oct 5 2026 1:27 AM | Updated on Oct 5 2026 1:27 AM

కాళోజీ సెంటర్‌ : పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అందించే అల్పాహారం, పాలు కార్యక్రమానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై మరుసటి పనిదినానికి అవసరమైన అల్పాహారం ఇండెంట్‌ను ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల్లోపు ఎండీఎం యాప్‌లో నమోదు చేయాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం నుంచి అక్టోబర్‌ 1న ఉత్తర్వులు జారీ అయ్యాయి.

7 మండలాల్లో బ్రేక్‌ ఫాస్ట్‌ అమలు

జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌లో 7 మండలాలను ఎంపిక చేశారు. అయితే ఎయిడెడ్‌, యూపీఎస్‌ హైస్కూల్‌ పాఠశాలలు కలిపి జిల్లాలో మొత్తం 294 పాఠశాలల్లో సుమారు 19 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందజేస్తున్నారు. వరంగల్‌, ఖిలా వరంగల్‌ మండల పరిధిలో ఉన్న పాఠశాలలకు అక్షయపాత్ర ఫౌండేషన్‌, గీసుగొండ, సంగెం, నల్లబెల్లి, వర్ధన్నపేట, దుగ్గొండి మండలాల్లోని పాఠశాలల్లో హరే కృష్ణ ఫౌండేషన్‌ ద్వారా అమలు చేస్తున్నారు. వీరికి మరుసటి రోజు బ్రేక్‌ ఫాస్ట్‌ ఇండెట్‌ ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు ఎండీఎం యాప్‌లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దీనిప్రకారం అక్షయ పాత్ర, హరి కృష్ణ ఫౌండేషన్‌ వారు విద్యార్థులకు అల్పాహారం అందజేస్తారు. అయితే యాప్‌లో టెక్నికల్‌ ఇబ్బందులు, అప్‌లోడ్‌ చేయడంపై అవగాహన లేకపోవడం, ఆన్‌లైన్‌లో ఆప్షన్లు రాకపోవడం వంటి కారణాలతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రాష్ట్ర అధికారులు ప్రతీ రోజు సెలవు దినాలు చూసుకొని యాప్‌లో ఎంట్రీ చేయాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

పెరిగిన సమయం..

మరుసటి రోజు అల్పాహారం ఇండెంట్‌ను గతంలో మధ్యాహ్నం 12 గంటల్లోపు నమోదు చేయాలని ఆదేశాలు ఉండగా, ప్రధానోపాధ్యాయుల సౌకర్యార్థం ఆ గడువును మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించారు. అయితే కొందరు హెచ్‌ఎంలు సరైన ఇండెంట్‌ నమోదు చేయకపోవడంతో అల్పాహారం సరఫరా చేసే ఏజెన్సీలు అవసరమైన పరిమాణంలో ఆహారాన్ని సిద్ధం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు గుర్తించారు.

జీరో ఇండెంట్‌తో అల్పాహారంలో కోత

హెచ్‌ఎంలు ఇండెంట్‌ నమోదు చేసే సమయంలో విద్యార్థుల సంఖ్య, అవసరమైన పరిమాణాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని సంబంధిత శాఖ అధికారులు సూచిస్తున్నారు. పొరపాటున ఇండెంట్‌ ‘జీరో’గా నమోదు చేసినా, ఆటో ఫార్వర్డ్‌ ద్వారా జీరోగా వెళ్లినా సిస్టమ్‌ దానిని అల్పాహారం అవసరం లేనట్లుగా పరిగణిస్తుంది. దీంతో సంబంధిత పాఠశాలకు ఆ రోజు అల్పాహారం సరఫరా చేయరు. ఇండెంట్‌ నమోదు చేయకపోవడం, తప్పుగా నమోదు చేయడం లేదా జీరో ఇండెంట్‌ కారణంగా అల్పాహారం సరఫరా కాకపోతే అందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. జిల్లా విద్యాశాఖాధికారులు ఈ ఆదేశాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ విషయంపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికారులు అందుబాటులో లేరు.

ముందురోజు మధ్యాహ్నం

2 గంటల్లోపు ఇవ్వాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement