కాశిబుగ్గ: ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం చొరవ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో మెరుగైన వైద్యసేవలందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ నగరంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు (యూహెచ్‌సీలు) అరకొర వసతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. నగరంలో ఏడు యూహెచ్‌సీలు ఉన్నాయి. దేశాయిపేట, చింతల్, కీర్తినగర్, ఫోర్ట్‌రోడ్డు అర్బన్ హెల్త్ సెంటర్లకు సొంత భవనాలు ఉన్నాయి. కాశిబుగ్గ, రంగశాయిపేట, ఎస్‌ఆర్‌ఆర్ తోట యూహెచ్‌సీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లో నడుస్తున్న ఆస్పత్రులకు ఏడాదిగా అద్దె చెల్లించకపోవడం సమస్యగా మారింది.
డాక్టర్లకు ఆర్థిక ఇబ్బందులు..
ప్రభుత్వం నుంచి నాలుగు సంవత్సరాలుగా యూహెచ్‌సీలకు నిర్వహణ నిధులు రావడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు అర్బన్ సెంటర్ల డాక్టర్లను వెంటాడుతున్నాయి. మూడేళ్ల నుంచి కరెంట్ బిల్లులు చెల్లించలేకపోతున్నారు. నోటీసుల మీద నోటీసులు వచ్చినా ఏం చేయలేకపోతున్నారు. ఇంటిఅద్దె, నీటిపన్నులు కూడా ప్రతీ ఏడాది పెరిగిపోతున్నా చెల్లించే పరిస్థితి లేదు. చివరకు ప్రిస్క్రిప్షన్ ప్యాడ్స్ కూడా లేకపోవడంతో తెల్లకాగితాలపై డాక్టర్లు వైద్య పరీక్షలు, మందుల వివరాలు రాయాల్సి వస్తోంది. అన్ని వైద్యచికిత్సల వివరాలు, డ్రగ్స్ తదితర వాటి గురించి ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి వైఫై సౌకర్యం కల్పించడం లేదు. ఈ ఖర్చులు వైద్యులే భరించాల్సి వస్తోంది.
భర్తీకాని ఖాళీ పోస్టులు..
పలు యూహెచ్‌సీల్లో స్టాఫ్‌నర్సుల కొరత తీవ్రంగా ఉంది. రెండు సంవత్సరాల నుంచి స్టాఫ్‌నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీకి నోచుకోవడం లేదు. నాలుగు నెలల నుంచి ల్యాబ్ టెక్నీషియన్లు లేరు. దీంతో పలురకాల వైద్య పరీక్షల కోసం రోగులు ఎంజీఎం ఆస్పత్రి, ప్రైవేట్‌కు వెళ్లాల్సి వస్తోంది.
కాంట్రాక్టు సిబ్బంది అవుట్‌సోర్సింగ్‌కు..
కాంట్రాక్టు పద్ధతిపై అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బందిని అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించారు. తమను రెగ్యులర్ ఉద్యోగులుగా చేస్తారని ఆశిస్తే ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించడం అన్యాయమని సిబ్బంది వాపోతున్నారు. ఉద్యోగ భద్రత, పీఎఫ్ సౌకర్యం లేదని ఆందోళన చెందుతున్నారు.
బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కరువు..
ప్రతీ క్లినిక్, ఆస్పత్రికి బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేస్తారు. యూహెచ్‌సీలకు లేకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోతోంది. పరిశుభ్రత లేకపోవడం, వ్యర్థాలను ఎవరూ తీసుకెళ్లకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆస్పత్రుల సమీపంలో ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యాధుల బారినపడిన వారు యూహెచ్‌సీలకు వస్తే మరిన్ని ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.2లక్షల నిధులు మంజూరు చేస్తామని..
దేశాయిపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్ కింద మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం అర్బన్ హెల్త్ సెంటర్ అభివృద్ధికి దాదాపు రూ.2 లక్షల నిధులు మంజూరు చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే ఈ పథకం గ డువు ఈ ఏడాది ఫిబ్రవరి 26న ముగిసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరు కాలేదు.
అసౌకర్యాల నడుమ
వరంగల్‌లోని యూహెచ్‌సీలు
నాలుగేళ్లుగా మంజూరుకాని నిర్వహణ నిధులు
స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు లేక ఇబ్బందులు
ఆస్పత్రుల్లో ప్రజలకు అందని మెరుగైన వైద్యసేవలు
కాయకల్ప అవార్డులు నిధులు రాలే..
దేశాయిపేట, చింతల్, కీర్తినగర్ అర్బన్ హెల్త్ సెంటర్లకు కాయకల్ప (శుచి శుభ్రత) అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ అర్బన్ హెల్త్ సెంటర్లకు పారితోషికం కింద రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు వ స్తాయని ఉన్నతాధికారులు చెప్పినా ఇంతవరకు రాలేదు. కనీసం ఈ డబ్బులు వ స్తే పారిశుద్ధ్య పనులు చేసే అవకాశం ఉంది. అయినా ఈ డబ్బులు ఎప్పుడు మంజూరు చేస్తారో తెలి యని పరిస్థితి నెలకొంది. యూహెచ్‌సీల్లో సి బ్బంది కొరత, అరకొర వసతులపై ఇన్‌చార్జ్ డీ ఎంహెచ్‌ఓ వి.ప్రకాశ్‌ను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నిధులు రాగానే వసతులు వసతులు కల్పిస్తామన్నారు.


