హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో బుధవారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురుపౌర్ణమిని పురస్కరించుకుని రుద్రేశ్వరస్వామిని శాకంబరుడిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ అవధాని, అర్చకులు ప్రణవ్, శ్రవణ్ ప్రభాత సేవ, గణపతి ఆరాధన, రుద్రేశ్వర శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పలుగ్రామాల నుంచి రైతులు అందించిన వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో స్వామివారిని శాకంబరుడిగా అలంకరించి మహాహారతి జరిపి భక్తులకు దర్శనానికి అనుమతించారు. పూజల్లో దేవాదాయశాఖ మాజీ కమిషనర్ అనిల్‌కుమార్, పద్మజ దంపతులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రుద్రేశ్వరసేవా సమితి సభ్యులు శ్రీనివాస్, జ్యోతి, అంజనేయులు, భువనగిరి మాధవరావు, వంశీ తదితరులు కూరగాయలు అందజేసిన వారిలో ఉన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.


