న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026
విద్యుత్ భద్రతపై రాజీ లేదు
విద్యుత్ భద్రతపై రాజీ పడేది లేదని, క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హెచ్చరించారు.
జీవిత సారం తెలిపే గురువు. కష్టాల్లో ధైర్యం నూరిపోసే వైద్యుడు. మన తరఫున వాదించే లాయర్. భవిష్యత్‌ను నిర్మించే ఇంజినీర్. నిత్యం రక్షణ కల్పించే పోలీస్. వాస్తవాలు తెలిపే జర్నలిస్ట్. ఆకలి తీర్చే రైతు. ఇలా ఎన్ని పాత్రల్లో అయినా ఒదిగిపోయే రియల్ హీరో నాన్న.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు రియల్ హీరోల
గురించి నేడు (ఆదివారం) ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.
నేడు ఫాదర్స్ డే
తండ్రి ప్రోత్సాహంతో
ఐఆర్‌ఎస్ అధికారిగా
సాక్షి, వరంగల్: పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. ఆ కలలను నిజం చేసేందుకు తమ శక్తిమేరకు కృషి చేస్తారు. అలాంటి ఓ తండ్రి దూరదృష్టి, మార్గనిర్దేశం, ప్రోత్సాహంతో గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన సయింపు కిరణ్ భారత రెవెన్యూ సేవ (ఐఆర్‌ఎస్) అధికారిగా ఎదిగారు. ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూరులో జీఎస్‌టీ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కిరణ్ తండ్రి ప్రభాకర్ ఓ సాధారణ రైతు. పెద్దగా చదువుకోకపోయినా చదువు విలువ తెలుసు. తన కుమారుడు ఉన్నత స్థానంలో ఉండాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నారు. ఆ కలలను సాకారం చేసే దిశగా కుమారుడిని తీర్చిదిద్దారు. ‘చిన్నగా ఆలోచించొద్దు... ప్రపంచం చాలా పెద్దది’ అని తండ్రి తరచూ చెప్పేవారని కిరణ్ గుర్తు చేసుకుంటారు. గ్రామీణ వాతావరణంలో పెరిగినా ప్రపంచస్థాయి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రోత్సహించేవారు. ఏ కోర్సు చదవాలి, ఏ పాఠశాలలో చేరితే భవిష్యత్ బాగుంటుంది, ఏ అవకాశాలు అందుబాటులో ఉన్నాయనే విషయాలను తెలుసుకుని తనకు వివరించేవారని పేర్కొన్నారు.
చేతిరాత నుంచి వ్యక్తిత్వ వికాసం వరకు..
పిల్లల అభివృద్ధి కేవలం చదువుతోనే కాదని భావించిన ప్రభాకర్.. కుమారుడి వ్యక్తిత్వ వికాసంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. చేతిరాత అందంగా ఉండేందుకు ప్రతిరోజూ రాయించేవారు. పాఠశాల ఉపాధ్యాయులను తరచూ కలిసి చదువు పురోగతి తెలుసుకునేవారు. మంచి స్నేహితులను ఎంచుకోవడం నుంచి సమయపాలన వరకు అనేక విషయాల్లో మార్గనిర్దేశం చేసేవారు.
నాన్నే నా తొలి గురువు..
నా జీవితంలో నాన్నే తొలి గురువు. ఆయన కలలు, కష్టం, మార్గనిర్దేశమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. నేను సాధించిన ప్రతి విజయానికి మూలం ఆయనే. ఎవరితో స్నేహం చేయాలి.. ఎవరితో వద్దనే విషయాలను కూడా నాన్న చెప్పేవారు. క్రమశిక్షణతో ఉండాలని, లక్ష్యంపై దృష్టి పెట్టాలని సూచించేవారు. ఆయన చూపిన మార్గంలో నడవడం వల్లే చిన్న గ్రామం నుంచి ఇంతదూరం వచ్చా. విద్య, ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ప్రతిరోజూ నడవడం, డ్రైఫ్రూట్స్, నానబెట్టిన గింజలు తీసుకోవడం వంటి అలవాట్లను చిన్నప్పుడే నేర్పించారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే జీవితంలో పెద్ద లక్ష్యాలను సాధించగలమని చెప్పేవారు. మధ్య తరగతి రైతు కుటుంబమైనా తనకు, తన చెల్లికి ఎలాంటి లోటు లేకుండా నాన్న పెంచారు. కుటుంబ పరిస్థితులు పరిమితంగా ఉన్నా పిల్లల చదువుల విషయంలో రాజీ పడలేదు. ఎలా ఉండాలి, ఎలా ఎదగాలో తండ్రి చూపిన మార్గమే నేడు నన్ను ఐఆర్‌ఎస్ అధికారిగా నిలబెట్టింది. – సయింపు కిరణ్
గెలుపు వెనుక దాగిన తండ్రి స్వేదం


