లోక్‌ అదాలత్‌కు అపూర్వ స్పందన | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌కు అపూర్వ స్పందన

Jun 21 2026 12:43 AM | Updated on Jun 21 2026 12:43 AM

లోక్‌ అదాలత్‌కు అపూర్వ స్పందన వేద పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు కందిపప్పు, పల్లి గింజలపై యోగాసనాల చిత్రాలు 28న జిల్లాస్థాయి ఓపెన్‌ టు ఆల్‌ చెస్‌ పోటీలు నేడు డ్రైవర్ల రాష్ట్ర సదస్సు

వరంగల్‌ లీగల్‌: వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లోని కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌కు అపూర్వ స్పందన లభించింది. ముఖ్య అతిథులుగా వరంగల్‌, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్లు బీవీ.నిర్మలా గీతాంబ, యం.రామకృష్ణ సునీత హాజరై జాతీయ లోక్‌ అదాలత్‌ను ప్రారంభించారు. వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్‌లను ఏర్పాటు చేయగా.. వరంగల్‌–8, నర్సంపేట–2 బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో సివిల్‌ కేసులు–33, క్రిమినల్‌ కేసులు 4,456, బ్యాంక్‌ పీఎల్‌సీ కేసులు–34, బీఎస్‌ఎన్‌ఎల్‌ కేసులు–19, ఎలక్ట్రిసిటీ పియల్‌సీ కేసులు–65, ట్రాఫిక్‌ ఈ–చాలన్‌ కేసులు–68,373, సైబర్‌క్రైమ్‌–15 పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్‌, హనుమకొండ న్యాయమూర్తులు నారాయణబాబు, పద్మజ, వరంగల్‌, హనుమకొండ జిల్లాల న్యాయసేవాదికార సంస్థ కార్యదర్శులు ఎ.ప్రదీప్‌, జి.రామలింగం, న్యాయమూర్తులు, ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చకిలం ఉపేందర్‌, చొల్లేటి రామకృష్ణ, బార్‌కౌన్సిల్‌ మెంబర్‌ సహోదర్‌రెడ్డి, ఇతర న్యాయవాదులు, బెంచ్‌ మెంబర్లు, వివిధ బ్యాంకు, ఇన్సూరెన్స్‌ ఉద్యోగులు, కక్షిదారులు పాల్గొన్నారు.

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి సాంగవేద ఆగమ సంస్కృత పాఠశాలలో వైదిక స్మార్త ఆగమం, తైత్తరీయ కృష్ణయజుర్వేదాధ్యయనంలో ప్రవేశం కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని అసిస్టెంట్‌ కమిషనర్‌, శ్రీభద్రకాళి దేవాలయం ఈఓ రామల సునీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేద పాఠశాలలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు మాతృభాషలో చదవడం, రాయగలిగిన వారు, 8 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉపనయన సంస్కారం, తదితర అర్హతలున్న రామల సునీత తెలిపారు. వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలోని వేదపాఠశాల కార్యాలయంలో 2026 జూన్‌ 21 నుంచి దరఖాస్తు ఫారాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను 2026 జూన్‌ 26 వరకు వేదపాఠశాల కార్యాలయంలో అందించాలని సూచించారు.

కాశిబుగ్గ: ఈ నెల 21న ప్రపంచ యోగా దినో త్సవం సందర్భంగా వరంగల్‌ కాశిబుగ్గ వివేకానంద కాలనీకి చెందిన మైక్రో ఆర్టిస్ట్ట్‌ కుసుమ లింగమూర్తి కందిపప్పు, పల్లి గింజలపై యోగాసనాల చిత్రాలు వేశారు. తనదైన శైలిలో యోగాసనాలు చేస్తున్నట్లు చిత్రాలను మలిచారు. ఇప్పటివరకు ఆయన చాలాసార్లు వివిధ ఆకృతులతో శనగపప్పు, బియ్యపు గింజలు, ద్రాక్ష పళ్లపై కూడా అద్భుతమైన కళాఖండాలు వేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 28న కల్నల్‌ సంతోశ్‌బాబు మెమోరియల్‌ ఓపెన్‌ టు ఆల్‌ చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి శనివారం కన్నా ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలను హనుమకొండ రెడ్డికాలనీలోని మాస్టర్జీ వికాస్‌ హై స్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన అండర్‌–10, 12, 14 విభాగాల నుంచి ఇద్దరు బాలబాలికలను, ఓపెన్‌ విభాగం నుంచి ఇద్దరిని జూలై 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ స్థాయి రాపిడ్‌ రేటింగ్‌ చెస్‌ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 90595 22986 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.

హన్మకొండ: టీజీఎస్‌ ఆర్టీసీ డ్రైవర్ల రాష్ట్ర స్థాయి సదస్సును ఈ నెల 21న హనుమకొండలో నిర్వహిస్తున్నట్లు స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్‌.రాంచందర్‌ తెలిపారు. ఆర్టీసీలో పని చేస్తున్న డ్రైవర్లు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండ పద్మాక్షి గుట్ట రోడ్డులోని ప్రసన్నాంజనేయ దేవాలయం ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే సదస్సుకు యూనియన్లకు అతీతంగా ఆర్టీసీ డ్రైవర్లు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement