పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
నడికూడ: పాపాలు పోవడానికే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని పలు గ్రామాల్లో రూ.1.60 కోట్ల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి మాట్లాడారు. ప్రజాధనాన్ని దోచుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చేసేవన్ని దరిద్రపు పనులేనని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గుప్తనిధుల కోసం కౌకొండ గుట్టలను కొల్లగొట్టారని, గుట్టలను తవ్విన మట్టిని రోడ్డు నిర్మాణ పనులకు విక్రయించి అక్రమ లాభాలు పొందారని మండిపడ్డారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. వనమహోత్సవంలో భాగంగా మండల కేంద్రంలో ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
● పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ శ్రీనాథ్
ఆత్మకూరు: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై పంచాయతీరాజ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ శ్రీనాథ్ సూచించారు. మండలంలోని కొత్తగట్టు గ్రామంలోని కంపోస్టు తయారీ, తడి, పొడి చెత్త సేకరణ, ఉపాధి హామీ పనులు, నర్సరీ నిర్వహణను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి, పొడి చెత్తను ఇంటి వద్దనే వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజలు అందించాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనుల్లో జాప్యం తగదని, వెంటనే పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీటి ట్యాంకులను అధికారులు సూచించిన తేదీల ప్రకారం శుభ్రం చేయాలన్నారు. ప్రజలకు పరిసరాల శుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని, వారికి గ్రామపంచాయతీ సిబ్బంది, అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ రమాకాంత్, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, డీఎల్‌పీఓ రవిబాబు, ఎంపీఓ యోగిత, ఈజీఎస్ ఏపీఓ రాజిరెడ్డి, సర్పంచ్ శ్రీజ, కార్యదర్శి రాజు, తదితరులు పాల్గొన్నారు.


