సాక్షి, వరంగల్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించాల్సిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి సమగ్ర గణాంకాలు లేకుండానే అధికారులు హాజరుకావడం చర్చనీయాంశమైంది. పథకాల వారీగా లబ్ధిదారుల సంఖ్య, పెండింగ్ పనులు, నిధుల వినియోగం, అమలులో జాప్యానికి కారణాలు వంటి కీలక వివరాలు లేకపోవడంతో ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలకు సమాధానాలు చెప్పాల్సిన అధికారులు అసంపూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావడంపై వరంగల్ ఎంపీ కడియం కావ్య, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్ధంతరంగా ముగిసిన సమావేశం
కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన కలెక్టరేట్‌లో గురువారం జరిగిన దిశా సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.సంధ్యారాణి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వైవీ గణేష్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు. ఉదయం 10గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం.. 11.30 గంటలకు మొదలుకావడం, ఆ తర్వాత వ్యవసాయం, వైద్యం, విద్యపై అరకొరగా చర్చ జరగగానే మీటింగ్ ముగిసింది. ఎజెండా ప్రతులు అందలేదని ఎంపీ కడియం కావ్య అనడంతో సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద స్పష్టం చేశారు.
పూర్తి సమాచారం లేకపోవడంతో..
● జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్‌లో భాగంగా 1,58,794 మంది రైతులకు 1,07,605 మందిని మాత్రమే నమోదు చేసినట్లు పేర్కొన్న అధికారులు.. వెనుకబడి పోవడానికి గల కారణాలతో పాటు ఏ మండలంలో ఎంతమేర నమోదైందన్న వివరాలు లేకపోవడంపై శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకొర సమాచారంతో అర్హులైన రైతులకు అన్యాయం జరిగే అవకాశముంటుందని పేర్కొన్నారు. ఎజెండా ప్రతిలో పేర్కొన్న జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం పేరును జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్‌గా మార్చినా కూడా పాత పేరునే వాడడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందని విమర్శించారు.
● ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా 10 క్లస్టర్లలో రాయపర్తి, ఖానాపురం, దుగ్గొండి, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో 1,250 మంది రైతులతో 1,250 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రూ.16.45 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, ఈ పథకం వల్ల రైతులు పొందిన లాభం, ఏఏ పంటలు వేశారనే వివరాలు పేర్కొనలేదంటూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏడాదిన్నరగా ఏం చేస్తున్నట్టు..?
● ఖానాపురం పీహెచ్‌సీ, కాశిబుగ్గ యూపీహెచ్‌సీ, రంగశాయిపేట యూపీహెచ్‌సీ, ఎస్‌ఆర్‌ఆర్ తోట యూపీహెచ్‌సీల కొత్త భవనాలకు ఒక్కోదానికి రూ.1.43 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయని, కొన్ని పనులు టెండర్ దశలో, మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. పనుల్లో పురోగతి మందగించడంపై డీఎంహెచ్‌ఓను ఎంపీ కడియం కావ్య, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మందలించారు. 15వ ఆర్థిక ఫైనాన్స్, ఎన్‌హెచ్‌ఎం నిధులు మంజూరైనా కూడా 92 ఎన్‌హెచ్‌ఎంలలో 32 పనులు ప్రారంభం కాగా, 17 ప్రోగ్రెస్‌లో, మరో 43 పనులు ఇంకా ప్రారంభించలేదంటూనే అవి ఎక్కడెక్కడా, ఇప్పటివరకు ఏ పనులు జరిగాయి, ఎందుకు పెండింగ్‌లో ఉన్నవి, అసలు పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలను ఎక్కడా ప్రస్తావించకపోవడంతో ఆగ్రహించారు. ఒకానొకదశలో వైద్య పురోగతిపై కలెక్టర్ సత్యశారద దృష్టి సారించాలంటూ వారు సూచించారు.
● ఎంజీఎంలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉండేందుకు వైద్యులు సమయపాలన పాటించాలని ఎంపీ కడియం కావ్య సూచించారు. సీసీటీవీ పర్యవేక్షణలో ఉదయం బయోమెట్రిక్ వేస్తున్న వైద్యులు.. సాయంత్రం మాత్రం బయోమెట్రిక్ నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)ను పకడ్బందీగా అమలుచేస్తే వైద్యులు సమయపాలనతో, పేదలకు వైద్యం గాడిలో పడుతుందని సూచించారు. ఆ తర్వాత విద్యారంగంపై చర్చ జరిగింది. అయితే, కేంద్ర పథకాల సమాచారం సమగ్రంగా ఉండేలా పూర్తి నివేదికలతో తదుపరి దిశా సమావేశానికి రావాలని అధికారులకు ఎంపీ బలరాంనాయక్ సూచించారు.
‘దిశ’ సమావేశానికి సరైన గణాంకాలతో హాజరుకాని అధికారులు
వారి నిర్లక్ష్యంపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం
పూర్తిస్థాయి చర్చ జరగకుండానే
ముగిసిన మీటింగ్


