‘గ్రేటర్’ పరిధిలో ముమ్మరంగా డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతీ రోజూ డ్రంకెన్‌డ్రైవ్ కేసులు బుక్ అవుతుండగా కోర్టులు జరిమానాలు విధించడంతోపాటు మత్తు మోతాదు పెరిగిన వాహనదారులు జైలుబాట పడుతున్నారు. కేసుల సంఖ్య చూస్తే ఓ వైపు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ మరోవైపు ప్రమాదాలు జరగకుండా పోలీసులు చేస్తున్న కట్టడి సత్ఫలితాలనిస్తోంది. ట్రైసీటి పరిధిలో రోజురోజుకూ వాహనాల రద్దీ పెరుగుతోంది. అదేరీతిలో మత్తులో వేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైన వాహనదారులపై కేసుల నమోదు సంఖ్యా పెరుగుతోంది. ఈ క్రమంలో ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆరు నెలల్లో కేసులు వేలల్లో ఉండగా జరిమానా కోట్లు దాటింది. వాహనదారులు మారితేనే ప్రమాదాలు తగ్గుతాయనే కారణంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడ్డ వారికి వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలోని కౌన్సెలింగ్ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. తాగి నడపడం వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరిస్తున్నారు.
ఆరు నెలల్లో 12,277 కేసులు..
ట్రైసిటీలోని మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు నెలల్లో 12,277 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. పోలీసులు ప్రధాన కూడళ్లు, జంక్షన్లు, రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్లు, సిగ్నిల్ పాయింట్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల సమయంలో ఒక్కోసారి వాహనదారులు మద్యం మత్తులో పోలీసులపై తిరగబడిన ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి. ట్రైసిటీలో ఆరు నెలల్లో 8 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు.
వీకెండ్‌లో తనిఖీలు పెంచుతున్నాం..
వీకెండ్‌లో మందుబాబుల కోసం తనిఖీలు పెంచుతున్నాం. మత్తులో జరుగుతున్న ప్రమాదాలపై కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తుంటే పోలీసులపై కొంతమంది మందుబాబులు తిరుగుబాటు చేస్తున్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. పదే పదే పట్టుబడ్డవారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. మద్యం సేవించి వాహనాలను నడపొద్దు అనే నిబంధన పెట్టుకుని బయటకు రావాలి.
– సత్యనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ
ఆరు నెలల్లో కేసులు 12,277.. జరిమానా రూ.1.39 కోట్లు
జైలుశిక్ష పడిన వాహనదారులు 230 మంది
మద్యం తాగి వాహనాలు నడపొద్దంటున్న ట్రాఫిక్ పోలీసులు
జైలు.. సామాజిక సేవ
దొరికిన మందుబాబులకు కోర్టు జరిమానా తోపాటు 230 మందికి జైలుశిక్ష విధించింది.
33 మంది వాహనదారులను సామాజిక సేవ చేయాలని కోరు ఆదేశించింది.
రెండు సార్లు పట్టుబడిన వారితోపాటు రీడింగ్ 100 దాటిన 246 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సుల రద్దు కోసం ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేశారు.
వాహనాలను ఇష్టారీతిన నడిపి పట్టుబడిన సుమారు 9,749 మందికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.


