విత్తన ఎంపిక కీలకం.. | - | Sakshi
Sakshi News home page

విత్తన ఎంపిక కీలకం..

Jun 18 2026 1:35 AM | Updated on Jun 18 2026 1:35 AM

విత్తన ఎంపిక కీలకం..

ఖిలా వరంగల్‌: వానాకాలం సాగులో రైతులు సరైన విత్తన ఎంపిక, సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన దిగుబడి సాధించవచ్చు. సరైన విత్తనాలు ఎంచుకుని సమగ్ర విధానాలు పాటిస్తే ఆశాజనకమైన దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల తెలిపారు. వానాకాలం పంటల సాగు నేపథ్యంలో సాక్షి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఫోన్‌ఇన్‌ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారి సమాధానాలు చెప్పి వారి సందేహాలను నివృత్తి చేశారు.

ప్రశ్న: వరి నారుమడిలో ఆకుకొనలు ఎర్రబడుతున్నాయి. ఏ రకం విత్తనాలు సాగుచేసుకోవచ్చు, కందిలో ఏ రకాలు సాగుచేయాలి?

– కన్నె మహేందర్‌, నల్లబెల్లి, సీహెచ్‌.లింగమూర్తి దుగ్గొండి, టి.వెంకన్న, మాన్‌సింగ్‌, పి.రాజు, కె.శ్రీను నెక్కొండ, రామచంద్రారెడ్డి వర్ధన్నపేట.

జవాబు: నారుమడిలో ఆకుల కొనలు ఎర్రబడడం వంటి లక్షణాలు పోషక లోపాల్ని సూచిస్తుంది. దీని నివారణకు సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. అలాగే కందిలో ప్రధానంగా డబ్ల్యూఆర్‌జీఈ–97, 93, 255 డబ్ల్యూఆర్‌జీ–121, టీడీఆర్‌జీ–4 రకాల విత్తనాలు సాగు చేసుకోవచ్చు. వరిలో వానాకాలం పంట సాగుకు విశ్వవిద్యాలయ విడుదల చేసిన సన్న రకాలైన కేఎన్‌ఎం–1638, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, డబ్ల్యూజీఎల్‌–962, సిద్ధి డబ్ల్యూజీఎల్‌–44 అనుకూలం. చెరువు కింద దీర్ఘకాలిక వరి రకమైన సిద్ది (డబ్ల్యూజీఎల్‌–44) బాగుంటుంది..140 నుంచి 145 రోజులు పంటకాలం.

ప్రశ్న: రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి? –టి.వీరస్వామి, వెంకటాపూర్‌, దుగ్గొండి

జ: వ్యవసాయ శాఖ, విశ్వ విద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమం రైతు వేదికల ద్వారా ప్రసారం చేస్తారు. మండల పరిధిలో అవగాహన కార్యక్రమాలు వ్యవసాయాధికారి నిర్వహిస్తారు.

ప్రశ్న: పత్తి సాగులో రకాలు.. పసుపు, మునగ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

– జి.నరేశ్‌, నల్లబెల్లి, పి.గణేశ్‌, దుగ్గొండి

జ: పత్తిలో నాణ్యమైన హైబ్రిడ్‌ రకాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా పంట వేసుకునేందుకు భూమి పూర్తిగా తడిసిన తర్వాతనే పత్తి విత్తనాలు విత్తుకోవాలి. పసుపు సాగులో ముఖ్యంగా ఆఖరి దుక్కి దున్నే ముందు మాగిన పశువుల ఎరువు చల్లుకోవాలి. ఆలాగే 200 కిలోల వేప పిండిని ఎకరానికి వేసుకోవాలి. విత్తనం ద్వారా సంక్రమించే చీడపీడలు, తెగుళ్లను అరికట్టడానికి విత్తనం శుద్ధి చేసుకోవడం ముఖ్యం. విత్తన శుద్ధికి దుంపను మూడు గ్రాముల రీడోమిల ఎంజెడ్‌ 0–3 మిల్లీ లీటర్ల ఇమిదాక్లో ప్రీడ్‌ లీటర్‌ నీటికి కలుపుకోవాలి.

ప్రశ్న: పప్పు ధాన్యాల్లో వాడే జీవన ఎరువులేవి, ఎల్‌నినో ప్రభావంలో మిర్చి సాగు చేయచ్చా?

– వెంకటేశ్వర్లు పర్వతగిరి, ఎం.రాంబాబు ఖానాపూర్‌

జ: రైజోబియం 200, పాస్పోబ్యాక్టీరియా 200 గ్రాములు కలిపి ఒక ఎకరానికి సరిపడు విత్తనాలకు కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ విత్తనాలను 24 గంటల లోపు విత్తుకోవాలి. నీటి వసతి కలిగి డ్రిప్‌ ద్వారా నీరు, ఎరువు ఇచ్చుకోగలిగితే మిర్చి సాగు చేసుకోవచ్చు. డ్రిప్‌ ద్వారా ఎరువు, నీటిని ఆదా చేసుకోచ్చు. దీంతోపాటు మరికొంత మంది రైతులు వివిధ పంటల సాగులో తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు.

అనుమతి ఉన్న డీలర్ల వద్దే కొనుగోలు చేయాలి

‘సాక్షి ఫోన్‌ఇన్‌’లో వరంగల్‌ జిల్లా

వ్యవసాయ అధికారి విజయ నిర్మల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement