● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: వానాకాలం వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని యూరియా ఎరువుల సరఫరాకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. విత్తనాల కొరత తలెత్తకుండా అవసరమైన నిల్వలను ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు. యూరియా పంపిణీపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన సహకార తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి సంబంధించిన ఏర్పాట్లపై రైతులకు సకాలంలో సలహాలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, వ్యవసాయశాఖాధికారి విజయనిర్మల, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్‌రావు, డీసీఓ నీరజ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నేడు దిశ సమావేశం
వరంగల్ జిల్లా దిశ(జిల్లా అభివృద్ధి సహకార, మానిటరింగ్ కమిటీ) సమావేశం నేడు(గురువారం) కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి దిశ చైర్మన్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాంనాయక్ హాజరవుతారని వెల్లడించారు.


