వరంగల్ అర్బన్: చెత్తే కదా అని మనం తేలిగ్గా తీసుకుంటాం.. ఇంట్లో ఉంటే దాన్ని బయట పడేసేంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు.. ఎందుకూ పనికిరాదనుకున్న చెత్త ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తోంది. మన దేశంలో సగటు మనిషితో రోజుకు 800 గ్రాముల చెత్త తయారవుతోందని నిపుణులు అంచనా. ఆ చెత్త సంపాదన సృష్టించగలదని ఎప్పుడో నిరూపితమైంది. ఇప్పటికే చిన్న ప్రాజెక్టులను రూపకల్పన చేసిన గ్రేటర్ వరంగల్ ఇక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
రోజుకు 440 మెట్రిక్ టన్నులు
గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా ఉన్న 66 డివిజన్లలో రోజుకు 440 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది. అందులో తడి చెత్త 40 శాతం, పొడి చెత్త 60 శాతం వస్తోంది. పొడి చెత్తలో 20 శాతం మేరకు డ్రై వేస్ట్ రిసోర్స్ కలెక్షన్ సెంటర్ (డీఆర్‌సీసీ) ద్వారా సేకరిస్తోంది. 40 శాతం తడి చెత్తలో ఒక శాతం హనుమకొండలోని బాలసముద్రం, బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని బయో మిథనైజేషన్ విద్యుత్ అథారిటీ ప్లాంట్లకు, మిగిలిన చెత్త రాంపూర్‌లోని బల్దియా డంపింగ్ యార్డుకు చేరుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో ప్లాంట్ నిర్వహణకు గ్రేటర్ వరంగల్ సన్నాహాలు చేస్తోంది. తడి, పొడి చెత్త సేకరణ రీయూజ్, రీసైక్లింగ్, రెడ్యూస్ కోసం అనేక ప్రయోగాలు చేసినా ఆశించిన మేరకు ఫలితాలను సాధించలేకపోయింది. ఇళ్లు, చిన్న, పెద్ద టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో కూరగాయల తరుగు, వండిన ఆహారం, గంజి, మాంసం, చేపలు కడిగిన నీరు, మిగిలిన ఆహార పదార్థాల వంటివి ఏమైనా కంపోస్టు చేసి వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
100 మెట్రిక్ టన్నుల చెత్తతో
బయోగ్యాస్ తయారీ..
నగర వ్యాప్తంగా సుమారు 176 మెట్రిక్ టన్నుల తడి చెత్త వెలువడుతోంది. అందులో 100 మెట్రిక్ టన్నుల తడి చెత్తతో బయోగ్యాస్‌ను తయారు చేసేందుకు ప్రాజెక్టును రూపకల్పన చేసింది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) కోసం ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం రాంపూర్ డంపింగ్ యార్డులో 8 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ పద్ధతిలో ఈ ప్రాజెక్టు నెలకొల్పేందుకు నాలుగు బడా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా టెండర్లు నిర్వహించారు. ఈనెల 18న టెండర్లు ఓపెన్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.97 కోట్ల వ్యయం అవుతందని ఇంజనీర్లు అంచనా వేసి టెండర్లు పిలిచారు. అందులో రూ.32 కోట్ల నిధులను వెచ్చించనుంది. మిగిలిన డబ్బులను టెండర్ దక్కించుకున్న సంస్థ వెచ్చించనుంది. 100 మెట్రిక్ టన్నుల తడి చెత్తను బల్దియా శానిటేషన్ విభాగం ధికారులు, సిబ్బంది రోజు వారీగా రాంపూర్ డంపింగ్ యా ర్డుకు తరలించాల్సి ఉంటుంది. ఆ చెత్తతో సదరు సంస్థ 6 మెట్రిక్ టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి (సీఎన్‌జీ) చేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.
భారీ ప్రాజెక్టుకు బల్దియా శ్రీకారం
రూ.92 కోట్లతో
పీపీపీ పద్ధతిలో ప్లాంట్
రాంపూర్ డంపింగ్ యార్డులో
8 ఎకరాల స్థలం


